మెట్రో ప్రాజెక్టుపై ఫోకస్..కేంద్రంతో మంతనాలు

by velandi.Saikiran |   (  Updated:2026-07-02 22:00:26  IST  )

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

మెట్రో ప్రాజెక్టుపై ఫోకస్..కేంద్రంతో మంతనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి, రెండో దశ ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా ఉండాలంటే ఎస్‌బీఐ క్యాప్స్ ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశకు సంబంధించిన ఐడీబీఐ, డీఎంఆర్సీ సమర్పించిన నివేదికలను ఇప్పటికే కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అంచనాలతో పాటు కేంద్రం కూడా స్వతంత్రంగా అంచనా వేయడానికి ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించిందని మెట్రో అధికారులు తెలిపారు. ఇదే సమయంలో మెట్రోరైలు ప్రాజెక్టుతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

కేంద్రానికి రెండు నివేదికలు

మెట్రో స్వాధీనానికి అవసరమైన ఫైనాన్స్, లీగల్, టెక్నికల్ అంశాలపై రూపొందించిన నివేదికలను మెట్రో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ), ఫైనాన్స్ మరియు లీగల్ అడ్వైజర్‌గా ఐడీబీఐ సమర్పించిన నివేదికలను కేంద్రం పరిశీలించిన అనంతరం, ఎస్‌బీఐ క్యాప్స్ ద్వారా మరోసారి సమగ్ర అంచనాలు చేయించనుంది. మొదటి దశ ప్రాజెక్టు స్వాధీనానికి సుమారు రూ.13,600 కోట్ల రుణం అవసరం కాగా, రెండో దశ విస్తరణకు సంబంధించిన అంచనాలు కూడా ఎస్‌బీఐ క్యాప్స్ నివేదిక ఆధారంగానే నిర్ణయించబడనున్నాయి.

ఢిల్లీకి మెట్రో అధికారులు

మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన రూ.13,600 కోట్ల రుణ అంశం కీలకంగా మారింది. ఈ లోన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయడానికి మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో సమావేశమైన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో కలిసి మెట్రో అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయడానికి, అవసరమైన పత్రాలను సమర్పించడానికి అధికారులు తరచుగా ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా ఇటీవల మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఢిల్లీ అధికారులతో సమావేశమయ్యారు.

6 నెలల్లో ఎస్‌బీఐ క్యాప్స్ నివేదిక

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొదటి దశ స్వాధీనానికి అవసరమైన రూ.13,600 కోట్ల రుణం, అలాగే రెండో దశ విస్తరణకు సంబంధించిన వ్యయ అంచనాలపై కేంద్రం నియమించిన ఎస్‌బీఐ క్యాప్స్ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీన ప్రక్రియ, విస్తరణ ప్రణాళికలు, నిర్మాణ వ్యయం, రుణ సేకరణ వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి ఈ నివేదిక సమర్పించనుంది. మెట్రో ఆస్తుల అంచనా, విస్తరణ ప్రణాళికల పరిశీలన, పత్రాల పరిశీలన వంటి ప్రక్రియలకు కన్సల్టెన్సీ సంస్థకు డిసెంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అధికారికంగా 2027లోనే హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Next Story