- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైటీడీఏ బోర్డు కూర్పు.. నాయకుల్లో అసంతృప్తి!
యాదగిరిగుట్ట అభివృద్ధికి కీలకంగా భావించే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వైటీడీఏ) పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట అభివృద్ధికి కీలకంగా భావించే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వైటీడీఏ) పాలకవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యాదగిరిగుట్ట ఆలయ పరిధిలోనే ఉన్న ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు తగిన ప్రాధాన్యం దక్కుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, తుది జాబితా ఆ ఆశలను నీరుగార్చింది. ఆలేరు నియోజకవర్గంలో అయితే ఈ అసంతృప్తి మరింత తీవ్రంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వైటీడీఏకు ఛైర్మన్‌తో పాటు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బోర్డులో స్థానిక రాజకీయ, సామాజిక వర్గాలకు పెద్దగా అవకాశం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి కోసం తీసుకునే కీలక నిర్ణయాల్లో స్థానికుల పాత్ర మరింత ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఆలేరు కాంగ్రెస్‌లో తీవ్ర నిరాశ..
గత కొద్ది రోజులుగా ఆలేరు నియోజకవర్గానికి చెందిన నాయకత్వానికి వైటీడీఏ పాలకవర్గంలో అవకాశం లభిస్తుందనే ప్రచారం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం దక్కుతుందనే ఆశతో కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూశాయి. అయితే తుది జాబితాలో ఆలేరు నియోజకవర్గానికి అవకాశం లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రభుత్వం పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భువనగిరిలోనూ అదే పరిస్థితి..
భువనగిరి నియోజకవర్గంలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకు భువనగిరి ప్రాంతానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పటికీ, స్థానిక నాయకత్వానికి బోర్డులో స్థానం కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు మరింత ప్రాధాన్యం లభిస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ, వైటీడీఏ పాలకవర్గ నియామకాల్లో అవి కనిపించలేదని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి..
వైటీడీఏ పాలకవర్గం ఏర్పాటు అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బోర్డు ఏర్పాటు విషయంలో స్థానిక సీనియర్ నేతగా, ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మునుగోడు నియోజకవర్గం ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఉందని అయినా కూడా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ అంశం జిల్లాలో మరింత చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు..
యాదగిరిగుట్టలోని స్థానిక ప్రజలు, వివిధ వర్గాల ప్రతినిధులు, రాజకీయ నాయకుల్లో కూడా వైటీడీఏ పాలకవర్గం పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న స్థానికులకు మరింత ప్రాధాన్యం కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వినిపిస్తోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన వారికి బోర్డులో అవకాశం ఇస్తే అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత ఉపయోగకరంగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అటు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక బీజేపీ నాయకులు సైతం స్థానికులకు కనీస గుర్తింపు ఇవ్వకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్య చేశారు.
రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న బోర్డు..
వైటీడీఏ పాలకవర్గానికి సాధారణ నామినేటెడ్ బోర్డు కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. యాదగిరిగుట్ట ఆలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, భూసేకరణ, మాస్టర్ ప్లాన్ అమలు వంటి కీలక అంశాలపై ఈ బోర్డు నిర్ణయాలు తీసుకోనుంది. అలాంటి కీలక బోర్డులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు, ముఖ్యంగా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కలేదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన అంశంగా మారింది. వైటీడీఏ బోర్డు నియామకాలతో మొదలైన అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం ఎలా చల్లారుస్తుందన్నది ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది..






