‘దిశ’ వరుస కథనాలు.. 150 ఎకరాల రక్షణకు కలెక్టర్ చర్యలు

by Malleboina Mahesh |

కొర్రెములలో రూ. వందల కోట్ల ప్రభుత్వ భూముల కబ్జాపై ‘దిశ’ కథనాలకు కలెక్టర్ స్పందించారు. 150 ఎకరాల రక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు.

‘దిశ’ వరుస కథనాలు.. 150 ఎకరాల రక్షణకు కలెక్టర్ చర్యలు
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొర్రెములలోని రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికార యంత్రాంగం ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. ‘దిశ’ దిన పత్రికలో ప్రచురితమైన వరుస కథనాలతో ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. నకిలీ ‘9 జీ’ సర్టిఫికెట్లు, కాలం చెల్లిన ఆర్డీవో ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని సర్కారీ భూములను దిగమింగుతున్న కబ్జాదారులు, వారికి సహకరిస్తున్న అధికారులపై కొరడా ఝుళిపించేందుకు కలెక్టర్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ స్థాయి అధికారులు రంగంలోకి దిగారు. నిషేధిత జాబితాలో ఉన్న సుమారు 150 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

‘దిశ’ వరుస కథనాలు..

పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867 తో పాటు పలు సర్వే నెంబర్ లో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు కబ్జాదారుల పాలవుతున్న తీరును ‘దిశ’ దినపత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. ‘సర్కారీ భూమికి సేల్ డీడ్స్!’ అనే శీర్షికతో మే 16న ప్రచురించిన కథనం ద్వారా నిషేధిత జాబితాలో ఉన్న భూములకు నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యథేచ్ఛగా సేల్ డీడ్స్ జరుగుతున్న వైనాన్ని ఎండగట్టింది. ఆ మరుసటి రోజు ‘9జీ ఒరిజినలేనా?’ అనే శీర్షికతో మరో కథనాన్ని ప్రచురించి.. అక్రమార్కులు రాత్రికి రాత్రే ‘9 జీ’ సర్టిఫికెట్లు సృష్టించి రూ. కోట్ల విలువైన భూములకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న తీరును సోదాహరణంగా వివరించింది.

సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలకు కలెక్టర్ లేఖ

‘దిశ’ వరుస కథనాలకు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ స్పందించారు. సర్వే నంబర్ 867 లోని నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన నారపల్లి సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్ స్పెక్టర్ జనరల్ కు లేఖ రాశారు. దీనిపై ఐజీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ‘ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేశాం, అసోసియేషన్ల నుండి ఒత్తిళ్లు వస్తున్నా సరే.. ఈ వ్యవహారంలోనూ తప్పక చర్యలు తీసుకుంటాం’ అని ఐజీ పేర్కొన్నట్లు సమాచారం.

కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న కబ్జాదారులు

క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలకు కబ్జాదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కబ్జాదారులకు రెవెన్యూ ఆఫీసర్ నోటీసులు జారీ చేసి, అడిషనల్ కలెక్టర్ కోర్టులో కేసులు వేశారు. అయితే ఆ నోటీసులనే పట్టుకుని కబ్జాదారులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీనికోసం వారు ఎప్పుడో ఒక పాత ఆర్డీవో ఇచ్చిన అనుకూల ఉత్తర్వులను కోర్టుకు సమర్పించారు. వాస్తవానికి ఆ పాత ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ఎప్పుడో రద్దు చేసింది. రద్దయిన పత్రాలను చూపిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి స్టే తీసుకువస్తున్నారని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి.

భూముల రక్షణే లక్ష్యంగా..

ప్రభుత్వం ఇప్పటికే 150 ఎకరాల భూమిని పీవోబీలో పెట్టిందని, దానిని కాపాడటంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారని అధికారులు చెబుతున్నారు. పాత ఉత్తర్వుల రద్దుకు సంబంధించిన వివరాలతో కోర్టులో కౌంటర్ వేసి, ప్రభుత్వ భూములపై ఉన్న స్టేలను ఎత్తివేయించేలా న్యాయపరమైన పోరాటానికి రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. ప్రభుత్వ భూములకు కాపలాగా ఉండాల్సిన కొందరు అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాయగా.. ‘దిశ’ ఈ కబ్జాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందుకు తెచ్చింది. దీంతో ఉన్నతాధికారుల చర్యలకు దిగగా.. అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. విచారణను వేగవంతం చేసి, న్యాయపరమైన చిక్కులను అధిగమించి.. ఆక్రమణదారుల చెర నుంచి సర్కారీ భూములను పూర్తిగా రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Next Story