విజిలెన్స్ అధికారుల ఆరా.. “వచ్చారు.. వెళ్లారు” కథనంపై కదిలిన యంత్రాంగం?

by Jakkula.Mamatha |

‘దిశ’ పత్రికలో ప్రచురితమైన “వచ్చారు.. వెళ్లారు” కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

విజిలెన్స్ అధికారుల ఆరా.. “వచ్చారు.. వెళ్లారు” కథనంపై కదిలిన యంత్రాంగం?
X

దిశ, పాల్వంచ టౌన్: ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన “వచ్చారు.. వెళ్లారు” కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది రైతులు ఉన్న పాల్వంచ మండలంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి కేవలం ఆరుగురు రైతులు మాత్రమే హాజరుకావాడాన్ని కథనం ఎండగట్టడంతో సంబంధిత శాఖల్లో కలకలం రేగినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహణ, రైతులకు సమాచారం చేరవేత, హాజరు నమోదు, అధికారుల బాధ్యతలపై విజిలెన్స్ అధికారులు ప్రాథమిక స్థాయిలో ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

కథనంతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు మండలంలో 8,231 మంది రైతులు, 24,652 ఎకరాల సాగుభూమి ఉన్నప్పటికీ రైతు నేస్తం కార్యక్రమానికి కేవలం ఆరుగురు మాత్రమే హాజరు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. రైతుల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎంత మేరకు చేరుతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా, రైతుల భాగస్వామ్యం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం వెనుక కారణాలపై ఇప్పుడు దృష్టి కేంద్రీకృతమైంది.విజిలెన్స్ దృష్టిలో కీలక అంశాలు విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారంలో పలు అంశాలపై ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.కార్యక్రమం విజయవంతమైందంటూ ఉన్నతాధికారులకు పంపిన నివేదికల్లో వాస్తవాలు ప్రతిబింబించాయా..?

అధికారుల్లో ఆందోళన..?

‘దిశ’ కథనం వెలువడిన తర్వాత సంబంధిత శాఖల్లో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. కార్యక్రమాల నిర్వహణలో లోపాలు బయటపడితే బాధ్యులపై చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు నేస్తం వంటి కార్యక్రమాలు కేవలం ఫొటోలు, నివేదికలకే పరిమితం కాకుండా రైతులకు ఉపయోగపడేలా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. “వచ్చారు.. వెళ్లారు” అనే ఒక్క కథనం రైతు నేస్తం కార్యక్రమాల నిర్వహణపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారనే వార్తతో రైతు వేదికల నుంచి జిల్లా కార్యాలయాల వరకు చర్చ సాగుతోంది. ఈ విచారణలో ఏం తేలుతుంది..? బాధ్యులపై చర్యలు ఉంటాయా..? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.”

Next Story