- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ కాంగ్రెస్‍లో కీలక పరిణామం.. పటాన్‌చెరు నుంచి బరిలో జగ్గారెడ్డి?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జగ్గారెడ్డి చేస్తున్న రాజకీయం తెలంగాణ కాంగ్రెస్‍లో ఉత్కంఠ రేపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రంజుగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ పోటీ కోసం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీనియర్లు రాజకీయం సాగిస్తుంటే తమ వారసుల కోసం రూట్ క్లియర్ చేసే పనిలో మరికొంత మంది బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఆసక్తిని రేపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పటాన్‍చెరు నుంచి బరిలోకి?:
తెలంగాణ కాంగ్రెస్‍లో ఫైర్ బ్రాండ్‍గా పేరున్న జగ్గారెడ్డి గత కొంత కాలంగా చేస్తున్న రాజకీయం సంగారెడ్డి జిల్లాలోనే కాకుండా తెలంగాణ కాంగ్రెస్‍లో చర్చనీయాశంగా మారుతోంది. తన సొంత గడ్డ సంగారెడ్డి నియోజకవర్గాన్ని వదిలి ఈసారి పటాన్‌చెరు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే విషయమై జగ్గారెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన పెద్దల వద్ద తన మనసులోని మాటను సైతం బయటపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సంగారెడ్డి బరిలో జగ్గారెడ్డి సతీమణి:
1986లో మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్గారెడ్డి.. 2004, 2009, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం విషయంలో తన మనసు మార్చుకున్నారు. సంగారెడ్డిలో తాను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని ఈ ఏడాది ప్రారంభంలో శపథం చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి నేను కాదు నా సతీమణి నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారని ఇందులో ఎలాంటి సందేహం లేదని మరోసారి కుండబద్దలు కొట్టారు. నిర్మల ప్రస్తుతం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా సేవలందించారు. అయితే తన సతీమణిని సంగారెడ్డి నుంచి బరిలోకి దింపి తాను పటాన్ చెరుపై దృష్టి సారించే వ్యూహంతో జగ్గారెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పటాన్‍చెరులో మూడుముక్కలాట:
జగ్గారెడ్డి పోటీపై ప్రచారం ఇలా జరుగుతుంటే పటాన్‍చెరు రాజకీయంలో ఇప్పటికే మూడుముక్కలాట హైవోల్టేజ్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడ హ్యాట్రిక్ విక్టరీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉండగా, కాంగ్రెస్ పార్టీలో కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ ఇద్దరు బలమైన ఆశావహులుగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‍లో చేరినా కాటా శ్రీనివాస్ వర్గంతో పొసగకపోవడంతో ఆయన తిరిగి బీఆర్ఎస్‍కు వెళ్లిపోయారనే టాక్ ఉంది. ఈ క్రమంలో ప్రచారం జరుగుతున్నట్లుగా జగ్గారెడ్డి పటాన్‍చెరు నియోజకవర్గంపై నిజంగానే దృష్టి సారించారా? రాబోయే రోజుల్లో జగ్గారెడ్డి వ్యూహం, సమీకరణాలు ఎలాంటి మలుపులు తిరుగబోతున్నాయి అనేది తెలంగాణ కాంగ్రెస్‍లో ఉత్కంఠ రేపుతోంది.






