నీట్ రీ-ఎగ్జామ్‌లో సైతం భారీ మోసం.. బీహార్‌లో సిబ్బందితో కలిపి 30 మంది అరెస్ట్!

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ రీ-ఎగ్జామ్‌లో మరోసారి భారీ అక్రమాలు వెలుగుచూశాయి.

నీట్ రీ-ఎగ్జామ్‌లో సైతం భారీ మోసం.. బీహార్‌లో సిబ్బందితో కలిపి 30 మంది అరెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET UG-2026) రీ-ఎగ్జామ్‌లో మరోసారి భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నకిలీ అభ్యర్థులతో పరీక్షలు రాయించేందుకు ప్రయత్నించిన ఘరానా ముఠా ఆటను బీహార్ పోలీసులు కట్టడి చేశారు. లఖిసరాయ్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో.. 9 మంది నకిలీ అభ్యర్థులతో (ఇంపర్సనేటర్స్) సహా మొత్తం 30 మందిని అధికారులు అరెస్ట్ చేశారు.

రూ. 10 లక్షల డీల్.. సిబ్బందితో కుమ్మక్కు!

పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే లీకేజీల వీరులు ‘సాల్వర్ గ్యాంగ్’ ఈ మోసానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాసేందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. బయోమెట్రిక్ వెరిఫికేషన్ సమయంలో నకిలీ అభ్యర్థులు దొరికిపోకుండా ఉండేందుకు సదరు కంపెనీ సిబ్బందితోనే ముఠా సభ్యులు కుమ్మక్కయ్యారు. ఇందులో భాగస్వామ్యమున్న 14 మంది బయోమెట్రిక్ కంపెనీ ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా స్పష్టం చేసింది.

సీక్రెట్ లొకేషన్‌లో విచారణ

లఖిసరాయ్‌లోని కేఆర్‌కే హైస్కూల్, కేంద్రీయ విద్యాలయ, హసన్‌పూర్ స్కూల్ పరీక్షా కేంద్రాల్లో ఈ అరెస్టులు జరిగాయి. జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణా కుమార్ నేతృత్వంలో అధికారులు ఈ తనిఖీలను పర్యవేక్షించారు. ‘మొత్తం 30 మందిని అరెస్ట్ చేశాం. అందులో 9 మంది ఇతరుల స్థానంలో పరీక్ష రాస్తుండగా, మిగిలిన 21 మంది ఈ ఫ్రాడ్‌ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్నవారే’ అని ఎస్డీపీఓ శివమ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం నిందితులందరినీ సీక్రెట్ లొకేషన్‌లో విచారిస్తున్నామని, ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు పలు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Next Story