- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీర్ తాగడంలో దూసుకెళ్తున్న భారతీయులు.. సర్వేలో ఆసక్తికర విషయాలు
భారత్‌లో బీర్ వినియోగం 14.6 శాతం వృద్ధితో దూసుకుపోతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీర్ మార్కెట్లలో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. కిరిన్ హోల్డింగ్స్ (Kirin Holdings) గణాంకాలను ఆధారంగా 'విజువల్ క్యాపిటలిస్ట్' రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రముఖ మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో బీర్ వినియోగం ఊహించని స్థాయిలో పుంజుకుంటోందని వెల్లడైంది. బీర్ వినియోగం పరంగా భారత్ ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల జాబితాలో చేరనప్పటికీ, బీర్ వినియోగిస్తున్న వారి వృద్ధి రేటులో మాత్రం రికార్డు సృష్టించింది. 2024లో భారతదేశంలో బీర్ వినియోగం అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 14.6 శాతం పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ప్రధాన బీర్ మార్కెట్లన్నింటిలోనూ ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం గమనార్హం. దేశంలో మారుతున్న జీవనశైలి, యువత జనాభా ఎక్కువగా ఉండటం, పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణే ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ఈ భారీ వృద్ధి కారణంగా అంతర్జాతీయ మాల్ట్ తయారీదారులు, గ్లోబల్ బ్రూయింగ్ కంపెనీలు భారత్‌ను ఒక కీలకమైన దీర్ఘకాలిక పెట్టుబడి కేంద్రంగా చూస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.
చైనా తర్వాత అమెరికా:
మొత్తం వినియోగం (Volume) పరంగా చూస్తే చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. 2024లో చైనాలో దాదాపు 4,050 కోట్ల (40.5 కోట్ల లీటర్లు) బీర్ వినియోగం జరిగింది. ఇది రెండో స్థానంలో ఉన్న అమెరికా (2,230 కోట్ల లీటర్లు) కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. వీటి తర్వతా బ్రెజిల్ (1,530 కోట్ల లీటర్లు), మెక్సికో (1,080 కోట్ల లీటర్లు) రష్యా (950 కోట్ల లీటర్లు). యూరప్‌లో జర్మనీ అత్యధికంగా బీర్ ఉత్పత్తి చేసే దేశంగా కొనసాగుతోంది. అయితే అక్కడ యువత మద్యం వినియోగానికి దూరంగా ఉండటంతో డొమెస్టిక్ వినియోగం క్రమంగా తగ్గుతోంది.
తలసరి వినియోగంలో యూరప్ టాప్!
జనాభా ఎక్కువగా ఉన్న చైనా, అమెరికా, భారత్ వంటి దేశాలు మొత్తం వాల్యూమ్ పరంగా మార్కెట్‌ను నడిపిస్తుంటే, ఒక వ్యక్తి సగటున తాగే (తలసరి) వినియోగంలో మాత్రం యూరప్ దేశాలు టాప్‌లో ఉన్నాయి. గత మూడు దశాబ్దాలుగా చెక్ రిపబ్లిక్ తలసరి బీర్ వినియోగంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ సగటున ఒక వ్యక్తి ఏడాదికి ఏకంగా 149 లీటర్ల బీర్ తాగుతుండగా ఆ తర్వాత లిథువేనియా, ఆస్ట్రియా, ఐర్లాండ్, క్రొయేషియా దేశాలు అత్యధిక తలసరి వినియోగంతో నిలిచాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19,400 కోట్ల లీటర్ల బీర్ వినియోగం జరగ్గా.. చైనా, జర్మనీ వంటి పాత మార్కెట్లు నెమ్మదించినా, భారత్, మెక్సికో, రష్యాల వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు గ్లోబల్ బీర్ రంగాన్ని ముందుకు నడిపిస్తున్నాయి.






