గిరిజనుల సంజీవని.. ఎర్ర చీమల పచ్చడి గురించి తెలుసా?

by Prasad Jukanti |

గిరిజనుల సంప్రదాయాలే కాదు ఆహారపు అలవాట్లు సైతం భిన్నంగా ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన వాటితోనే పొట్ట నింపుకునే గిరిజనుల ఆహారం ఎర్ర చీమల చట్నీ వైరల్ అవుతోంది.

గిరిజనుల సంజీవని.. ఎర్ర చీమల పచ్చడి గురించి తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా భారతీయ ఇండ్లలో మామిడికాయ, టమాటో, చింతపండుతో పచ్చళ్లు తయారు చేసుకుని తినడం తెలిసిందే. కానీ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గిరిజన తెగలోని ప్రజలు మాత్రం ఎర్రచీమలు, వాటి గుడ్లతో పచ్చడి చేసుకోవడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆహారంలో చీమలు పడితేనే కొంత మంది ఆలోచిస్తారు. కానీ ఆ చీమలే పచ్చడిగా చేసుకుని లొట్టలేసుకుంటూ ఆరగిస్తుండటం ఆసక్తిగా మారింది. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయక వంటకం తమకు ఓ ఇమ్యూనిటీ బూస్టర్‍గా పని చేస్తుందని స్థానిక గిరిజనులు చెబుతున్నారు.

గిరిజనుల సంజీవని:

ఈ ఎర్ర చీమల పచ్చడిని స్థానిక గిరిజనులు ఒక సహజ సిద్ధమైన ‘సంజీవని’గా భావిస్తారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందించడమే కాకుండా, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు నమ్ముతున్నారు. అడవిలోని చెట్లపై ఉండే గూళ్ల నుంచి ఈ ఎర్ర చీమలను, వాటి గుడ్లను సేకరించి అందులో తినడానికి వీలుపడని భాగాలను తొలగిస్తారు. తర్వాత వాటిని పెనం మీద వేయిస్తారు. ఆ తర్వాత మిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, చింతపండు, కొబ్బరి, పుదీనా అందుబాటులో ఉన్న వాటిని కలుపుకుని రోట్లో రుబ్బుకుంటే ఎర్ర చీమల చట్నీ రెడీ అవుతందని చెబుతున్నారు. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలోని గిరిజనులు ఎంతో ఇష్టంగా తినే ఈ ఎర్రచీమల చట్నీకి GI ట్యాగ్ కూడా లభించింది.

Next Story