ఆదిలాబాద్ అభివృద్ధికి గేట్‌వేగా ఎయిర్‌పోర్ట్..

by Batti.Sumithra |

ఆదిలాబాద్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కీలక మలుపు కానుందని, దీనికి సంబంధించిన తాజా పరిణామాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

ఆదిలాబాద్ అభివృద్ధికి గేట్‌వేగా ఎయిర్‌పోర్ట్..
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కీలక మలుపు కానుందని, దీనికి సంబంధించిన తాజా పరిణామాలను ప్రజలకు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు పై ప్రజల్లో ఉన్న అనుమానాలకు తెరదించుతూ, సోమవారం ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన సమావేశంలో కీలక అవగాహన కుదిరిందన్నారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్‌పోర్ట్ రావడం గొప్ప అవకాశమని, జిల్లాలో మరింత అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా మరో 400 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం సేకరించనున్నట్లు తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 80 ఎకరాలు తక్షణమే కేటాయించి టెర్మినల్ భవనం, విమాన రాకపోకలకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఒప్పందం కుదిరిందన్నారు. హై టెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.340 కోట్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.600 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

భూసేకరణ నిధుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని, జిల్లాలో ఉత్పత్తయ్యే వస్తువులను దేశ విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేక హ్యాంగర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, రక్షణ శాఖ ప్రతినిధులు ఆదిలాబాద్‌కు వచ్చి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశాల పై అనవసర రాజకీయాలు చేయకుండా ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఆయన కోరారు. జిల్లాకు మేలు చేసే కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన..

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రామాయి–రాంపూర్ మధ్య ప్రతిపాదిత రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. అన్ని అనుమతులు దాదాపు పూర్తయ్యాయని, అధికారికంగా పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. సుమారు ఒకటి నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2,000 మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. అలాగే ఆదిలాబాద్‌లో మరిన్ని సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటుకు అవసరమైతే సున్నపురాయి నిల్వలున్న ప్రాంతాలను టెండర్ల ద్వారా పరిశ్రమలకు అందించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోగు రవి, పోషాన్న, ధోని జ్యోతి దయాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story