- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లష్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ నిరసన
లస్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని లస్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లష్కర్‌గూడ మాజీ ఎంపీటీసీ సీకా సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లస్కర్‌గూడ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.40 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు కొనసాగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. వర్షాకాలంలో వాగు ఉధృతి పెరగడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వాగులో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిధులు మంజూరు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం పనులను పూర్తి చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నాలుగు సార్లు వచ్చినప్పటికీ అభివృద్ధి జరగలేదని, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించకుండా మంత్రి పదవి కలలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. లష్కర్‌గూడ, అనాజ్‌పూర్, మజీద్‌పూర్, గుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు ఈ బ్రిడ్జి అత్యంత కీలకమని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, బండరావిరాల, చిన్నరావిరాల ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు. ఇప్పటికే మూసీ, క్రషర్ మిల్లుల కాలుష్యంతో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని అన్నారు. అనంతరం లష్కర్‌గూడ బ్రిడ్జిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనకు బీఎస్పీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్త కిషన్ గౌడ్, జక్కిడి రామిరెడ్డి, సురకంటి శ్రీనివాస్‌రెడ్డి, పూజారి చక్రవర్తి, చెరుకు కిరణ్‌కుమార్ గౌడ్, మొగుళ్ల జీవన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






