- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ మార్కు ‘ఇందిరమ్మ’ దందా!
సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఇళ్ల కేటాయింపులు, పెన్షన్ల కోతపై కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు బీఆర్ ఎస్ నేతలు.

దిశ, మేడ్చల్ బ్యూరో: అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కొత్తగా ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ నేతలు దళారుల అవతారమెత్తి అమ్ముకుంటున్నారని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మేడ్చల్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ శాసనసభ్యులు కేపీ వివేకానంద, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, శాసనమండలి సభ్యులు శంబిపూర్ రాజు లు సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఇళ్ల కేటాయింపులు, పెన్షన్ల కోతపై కలెక్టర్‌తో సుదీర్ఘంగా చర్చించారు.
”ఇందిరమ్మ” దందా చేస్తున్నారా..?
జిల్లా కలెక్టర్ ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. "ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం సగం టర్మ్ పూర్తయినా ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ గారు లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, 80 శాతం పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయించారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త ఇంటికి పునాది వేయలేదు. గృహనిర్మాణ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి గారు గతంలో ఛాలెంజ్ చేశారు.. '20 లక్షల ఇళ్లు కట్టించాకే ఓట్లు అడుగుతాం' అని. మరి ఇప్పుడు ఆ మాటపై కట్టుబడి ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ కట్టించిన ఇళ్లకే ఇందిరమ్మ పేరు పెట్టుకుని కాలయాపన చేస్తున్నారు అని ఇళ్ళ కేటాయింపును ఒక దందాలా చేశారని దుయ్యబట్టారు."
లోపాయికారీగా ఇళ్ల దందా..
మేడ్చల్ జిల్లాలో ఇంకా సుమారు 6 వేల,5 వందల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి కావాల్సి ఉందని, వాటిని కాంగ్రెస్ స్థానిక నాయకులు, మంత్రుల చుట్టూ తిరుగుతూ, పైరవీలు చేస్తూ లోపాయికారీగా పంచుకుంటున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. పేదల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ దందాకు తెరలేపారని మండిపడ్డారు. ఈ అక్రమ కేటాయింపులను ఆపాలని, గతంలో లాగే ప్రజలందరి సమక్షంలో పూర్తి పారదర్శకంగా, లాటరీ పద్ధతిలోనే అర్హులకు ఇళ్లు కేటాయించాలని కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. నాడు అసైన్డ్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకవేళ కాంగ్రెస్ నేతల దందా ఇలాగే కొనసాగితే పేదలతో కలిసి పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
కొత్త పెన్షన్లు దేవుడెరుగు.. ఉన్నవి ఊడబీకుతున్నారు!
వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తామని ఆశ చూపి, ఇప్పుడు ఉన్న పెన్షన్లను కూడా ఊడబీకుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సరైన విచారణ చేయకుండా, వెరిఫికేషన్ల పేరుతో పేదల పెన్షన్లను తొలగించే దుష్చర్యకు ప్రభుత్వం పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 18 నుండి 19 లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం 2 లక్షల ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.






