రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ ప్రాజెక్టులపై చర్చ

by Prasad Jukanti |

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్‍తో భేటీ అయ్యారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఆ ప్రాజెక్టులపై చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదిలీ చేసినందుకు గాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్‍కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఇవాళ ఉదయం రాజ్‍నాథ్ సింగ్‍తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక రక్షణ, విమానయాన ప్రాజెక్టులపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ. యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామన్నారు. దేశ స‌మ‌గ్రత‌, ర‌క్షణ‌కు సంబంధించిన అంశమైనందున రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తామ‌ని సీఎం తెలిపారు.

డీఆర్‌డీవో ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలి:

ఆదిలాబాద్‍లో రానున్న భార‌తీయ వాయు సేన ఎయిర్‌పోర్ట్ ను భారీగా విస్తరిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని వెల్లడించారు. భార‌త వాయుసేన టెర్మిన‌ల్‌తో పాటు ప్రయాణికుల సౌక‌ర్యార్ధం నిర్మించ‌నున్న పౌర విమాన‌యాన శాఖ‌కు చెందిన టెర్మిన‌ల్ బిల్డింగ్‌తో పాటుగా కార్గో, ఎంఆర్‌వో (MRO), హ్యాంగ‌ర్ (HANGER) సౌక‌ర్యాల‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా స‌హ‌క‌రించాల‌ని ముఖ్యమంత్రి కోరారు. ఇటీవ‌ల మ‌ధ్య ప్రాచ్య ఆసియాలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్‌లైన్స్ త‌మ హ్యాంగ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి అత్యంత అనుకూల‌మైన ప్రాంతం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ అని ఆ దిశ‌గా అభివృద్ధి చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దేవ‌ర‌క‌ద్ర స‌మీపంలో డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన‌ కీల‌క‌మైన‌ ప్రాజెక్ట్‌ను త్వర‌గా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Next Story