- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారి మళ్లిన యూరియా.. కీసర పరిశ్రమకు?
సిద్దిపేట జిల్లాలో యూరియా అక్రమాలపై డొంక కదులుతోంది.

దిశ, సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల: సిద్దిపేట జిల్లాలో యూరియా అక్రమాలపై డొంక కదులుతోంది. రైతులకు అందించాల్సిన సబ్సిడీ యూరియాను హోల్‌సేల్, రిటైల్ ఫెర్టిలైజర్ షాపుల యజమానులు కుమ్మక్కై కీసర ప్రాంతంలోని పరిశ్రమలకు దారి మళ్లించారన్న అనుమానాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరిగిన యూరియా లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. హోల్‌సేల్ డీలర్ల స్టాక్ రిజిస్టర్లు, జీఎస్టీ బిల్లులు, ఈ-పాస్ మెషీన్ డేటాను క్రాస్ చెక్ చేస్తున్నారు. శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్, శ్రీగణేష్ ట్రేడర్స్ హోల్‌సేల్ షాపుల నుంచి ఏయే రిటైల్ షాపులకు, ఎంత పరిమాణంలో యూరియా వెళ్లిందో లెక్క తేలుస్తున్నారు. రీటైల్ షాపుల ద్వారా విక్రయించిన యూరియా అసలు రైతులకు చేరిందా లేదా అనే కోణంలో విచారణ సాగుతోంది.
వివరాల్లోకి వెళ్లితే.. సిద్దిపేట జిల్లాలో సుమారు ఫెర్టిలైజర్ హోల్ షాపులు 28 ఉండగా, 6 వందల వరకు రీటైల్ ఫెర్టిలైజర్ షాపులు ఉన్నాయి. జిల్లాలో ప్రతి సీజన్‌కు సుమారు 45 వేల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఈ మొత్తం యూరియాను హోల్ సెల్ డీలర్ల నుంచి రీటైల్ డీలర్ల ద్వారా రైతులకు సరఫరా చేస్తుంటారు. చేర్యాల మండలంలోని శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్ లో నుంచి రైతులకు యూరియా అమ్మకాలు జరపకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించడంతో 6429 బ్యాగుల యూరియా పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ హోల్ సేల్ డీలర్ల నుంచి నేరుగా కీసరలోని ఓ పరిశ్రమకు పంపించినట్లు విశ్వసనీయ సమాచారం.
యూరియా బస్తా రూ.1000కి విక్రయం..
కేంద్ర ప్రభుత్వం యూరియా పై భారీ సబ్సిడీని అందిస్తుంది. యూరియా బస్తా విలువ సుమారు రూ.2300 ఉంటుంది. సబ్సిడీ పోగా రైతులకు రూ.266.30కి విక్రయిస్తారు. ఇదే అదనుగా అక్రమాలకు తెరలేపిన హోల్ ఫెర్టిలైజర్ షాప్ యజమాని రీటైల్ ఫెర్టిలైజర్ యజమాని రైతుల ఆధార్ కార్డుల ఆధారంగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. యూరియా బస్తా రూ.1000 చొప్పున ఓ పరిశ్రమకు అమ్ముకొని పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. సుమారు రూ. 60 లక్షల గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తుంది. యూరియా యాప్ తో అక్రమాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదే తరహాలో గతంలో సబ్సిడీ యూరియా పక్కదారి పట్టించారా? లేదా? అంశంపై విచారణ జరిపించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ అధికారి పై వేటు..
చేర్యాల మండల కేంద్రంలోని శ్రీ సాయి శివ ఫర్టిలైజర్‌లో జరిగిన 6429 బస్తాల సబ్సిడీ యూరియా పక్కదారి మళ్లింపు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని విధులు నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ ల లైసెన్స్‌లను వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేశారు. అదే విధంగా శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్ షాప్ యజమాని చేతి రెడ్డి సందీప్ రెడ్డి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ కే. హైమావతి
యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై పైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.హైమావతి హెచ్చరించారు. యూరియా యాప్‌ను ఉపయోగించడం ద్వారా ఎలాంటి డైవర్షన్ జరగకుండా నియంత్రించే అవకాశం ఉందన్నారు. ఫెర్టిలైజర్ షాపు యజమానులు యూరియా యాప్ ద్వారా మాత్రమే యూరియా విక్రయాలు జరపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.






