- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amarnath Yatra: భక్తులకు బిగ్ అలర్ట్.. భారీ భద్రత నడుమ అమర్‌నాథ్ యాత్ర షురూ
అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: హిమాలయ శిఖరాల్లో అతి పవిత్ర అమర్‌నాథ్ గుహాలయంలో వెలిసిన ‘బాబా బర్ఫానీ’ దర్శనానికి వార్షిక అమర్‌నాథ్ యాత్ర ఇవాళ ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని 2 ప్రధాన బేస్ క్యాంపులైన గందర్‌బల్ జిల్లాలోని బాల్తాల్ (Baltal), అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్-పహల్గామ్ (Nunwan-Pahalgam)ల నుంచి తొలి విడత భక్తులు తమ పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 57 రోజుల పాటు సాగనున్న ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక యాత్ర, ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ముగియనుంది. ఇవాళ ఉదయం దిక్కులు పిక్కటిల్లేలా ‘బమ్ బమ్ భోలే’, ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో బేస్ క్యాంపుల పరిసరాలు మారుమోగిపోయాయి. పహల్గాం నుంచి సుదీర్ఘమైన 48 కి.మీ సాంప్రదాయ మార్గంలోను, బాల్తాల్ నుంచి నిలువుగా ఉండే 14 కి.మీ తక్కువ దూరపు మార్గంలోను భక్తులు ముందుకు కదులుతున్నారు.
‘ప్రాజెక్ట్ హాక్ ఐ’తో హైటెక్ భద్రత..
అమర్‌నాథ్ యాత్ర ఎలాంటి అంతరాయాలు లేకుండా సాగడానికి కాశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ (CRPF), భారత సైన్యంతో కూడిన మల్టీ-లేయర్ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రక్షణ కోసం, వారి వాహనాల కదలికలను గమనించడానికి RFID ట్రాకింగ్ సిస్టమ్ తప్పనిసరి చేశారు. నిఘా కోసం మార్గమంతటా 416 హై-రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, 34 ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ కెమెరాలను అమర్చారు. వైమానిక నిఘా కోసం ‘ప్రాజెక్ట్ హాక్ ఐ’ (Project Hawk Eye) కింద నిరంతరం డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో 22 ప్రత్యేక స్నైపర్ టీమ్‌లను, ఎత్తైన నిఘా పోస్టులను ఏర్పాటు చేశారు. వాతావరణంలో మార్పులు వస్తే భక్తులు తలదాచుకోవడానికి మార్గమంతటా అత్యవసర షెల్టర్లను, ఆక్సిజన్ బూత్‌లతో కూడిన వైద్య శిబిరాలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.






