రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరోసారి లక్షన్నరకు చేరువ

by Malleboina Mahesh |

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,47,000.. కేజీ వెండి ఏకంగా రూ.2,60,000కి చేరింది.

రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరోసారి లక్షన్నరకు చేరువ
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా మూడు రోజుల్లో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు(Gold prices) గురువారం నుంచి షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు భారీగా ధరలు పెరగడంతో భాగ్యనగర బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. తాజాగా పెరిగిన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) మేలిమి బంగారం ధర ఏకంగా రూ. 3,220 పెరిగి రూ. 1,47,000 మార్కుకు చేరింది. దీంతో గడిచిన కేవలం రెండు రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 6,220 పెరగడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 2,950 ఎగబాకి ప్రస్తుతం రూ. 1,34,750 పలుకుతోంది. పసిడి బాటలోనే వెండి కూడా భారీ పరుగులు పెట్టింది. పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో కేజీ వెండి ధర ఒకే రోజు ఏకంగా రూ. 10,000 పెరిగి రూ. 2,60,000 కి చేరుకుంది. అయితే స్థానిక ట్యాక్సులు, నగల దుకాణాల మేకింగ్ ఛార్జీలను బట్టి నగరంలోని వివిధ ప్రాంతాలలో ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.

Next Story