బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం.. వినూత్నంగా బుద్ధి చెప్పిన రైతు

by Muthe.Rajitha |

మధ్యప్రదేశ్‌లోని ఒక రైతు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేసిన వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం.. వినూత్నంగా బుద్ధి చెప్పిన రైతు
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఒక రైతు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా చేసిన వినూత్న నిరసన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా "గాంధీగిరి" తరహాలో సాగిన ఈ నిరసన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ధార్ జిల్లాలోని చంద్వాడా గ్రామానికి చెందిన విజయ్ పటీదార్ అనే రైతు IDFC ఫస్ట్ బ్యాంక్ నుంచి 13 లక్షల రూపాయలు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని వడ్డీతో సహా పూర్తిగా చెల్లించినప్పటికీ, బ్యాంకు అధికారులు గత నెల రోజులుగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) ఇవ్వకుండా ఆయనను ముప్పుతిప్పలు పెట్టారు.

ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన సదరు రైతు, తన నిరసనను ఎవరూ ఊహించని విధంగా 'మాస్ స్టైల్'లో తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 23న తన బంధువులు, మిత్రులతో కలిసి డ్రమ్స్, బాజాలతో నేరుగా బ్యాంకు కార్యాలయంలోకి ప్రవేశించిన విజయ్ పటీదార్, అక్కడ పెద్ద పెట్టున సంగీతం వాయిస్తూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు చూస్తుండగానే, "నెల రోజులుగా నన్ను తిప్పించారు కదా, ఇప్పుడు నా ప్రతాపం చూడండి" అన్నట్లుగా ఆయన చేసిన హంగామాకు బ్యాంకు మేనేజర్ తోసహా సిబ్బంది కంగుతిన్నారు.

ఈ సంఘటనతో ఖంగుతిన్న బ్యాంకు అధికారులు వెంటనే దిగివచ్చారు. వెంటనే ఆయనకు ఎన్ఓసీ (NOC) అందిస్తామని బ్యాంక్ మేనేజర్ హామీ ఇచ్చారు. ఈ వినూత్న పోరాటానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అప్పు ఇచ్చేటప్పుడు ఆరాటం చూపే బ్యాంకులు, తీరా రుణం తీర్చిన తర్వాత పత్రాలు ఇవ్వడానికి రైతులను ఇబ్బంది పెట్టడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

Next Story