- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఓట్ల లెక్కింపు వేళ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరికలు
చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ నెల 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది.ఈ క్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అడ్డుకోవడం, వారిపై దాడులు చేడయం వంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
అలాగే చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తు చేస్తూ, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే 'చట్టం తన పని తాను చేసుకుపోతుందని' డీజీపీ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని, ప్రతి ఒక్కరూ ఎన్నికల కోడ్, పోలీసు సూచనలను పాటించాలని కోరారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ఒకవేళ ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రవర్తనపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన మార్గాల్లో ఫిర్యాదు చేయాలని డీజీపీ సూచించారు. బాధితులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC), సంబంధిత శాఖలోని ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని డీజీపీ హెచ్చరించారు.






