- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తోపులాట జరగకుండా నిఘా.. గోదావరి పుష్కరాల బందోబస్తుపై పోలీసు అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ భగవత్ గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీ లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాబోయే గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ భగవత్ గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీ లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తాత్కాలిక పోలీస్ అవుట్‌పోస్టుల ఏర్పాటు, ఆధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ హాల్ నిర్మాణం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాల ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పుష్కరాల సమయంలో భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ నిర్వహణ, విపత్తు నిర్వహణ బృందాల సిద్ధత, అగ్నిమాపక, వైద్య, ఎన్‌డీఆర్‌ఎఫ్/ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం, తాగునీరు, లైటింగ్, పారిశుద్ధ్యం, తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు, సమాచార వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రతి పోలీస్ యూనిట్ ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలతో సమన్వయం పెంచుకుని భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన పుష్కరాలను అందించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్, అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, గోదావరి పరివాహక ప్రాంతంలోని సీఐలు, ఎస్సైలు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.






