ఆగస్టు తొలివారంలో ప్రత్యేక అసెంబ్లీ.. 21 ఏళ్లకే చట్టసభలకు వచ్చేలా తీర్మానం : సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

నీట్ పేపర్ లీక్ పై నిరసన చేసి.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఆగస్టు తొలివారంలో ప్రత్యేక అసెంబ్లీ.. 21 ఏళ్లకే చట్టసభలకు వచ్చేలా తీర్మానం : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీక్ పై నిరసన చేసి.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. నెక్లెస్ రోడ్డులో శనివారం సాయంత్రం నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చెప్పన్ ఇంచ్ ఛాతీ యువత ముందు తలొగ్గిందని, జెన్ జీ యువతలో విజయదరహాసం కనిపిస్తోందన్నారు. యువత తలచుకుంటే చేయలేనిదేదీ లేదని నేడు నిరూపించారన్నారు. మోడీ తలవంచి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విద్యార్థుల ఉద్యమమే కారణమని, దీనిని కాంగ్రెస్ ఖాతాలో ఎట్టిపరిస్థితుల్లోనూ వేసుకోబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాడుతామని విద్యార్థులు దేశానికొక సందేశమిచ్చారన్నారు. దేశ భవిష్యత్ అంతా యువతరానిదేనని, యువత బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.

కేంద్రంతో సీజేపీ జరిపిన చర్చల్లో ఇంకా కొన్ని డిమాండ్లు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఇంకా విత్ డ్రా చేసుకోలేదని, సోమవారం నాటికి కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఝుళిపించిన లాఠీఛార్జీలు, తూటాలు యువతను భయపెట్టలేదన్నారు. కొన్ని దేశాల్లో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు వెళ్లవచ్చని, 21 సంవత్సరాలు వస్తే సింగపూర్ లో ప్రధాని కావొచ్చన్నారు. ఆగస్టు తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసేందుకు 21 సంవత్సరాలు ప్రధాన అర్హతగా తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపుతానన్నారు. జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడమే కాకుండా.. లోక్ సభ, రాజ్యసభలో యువత గళాన్ని విప్పేలా చేస్తామన్నారు.

Next Story