కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకుల సేవలు, కృషి అభినందనీయం: డీజీపీ సీవీ ఆనంద్

by Jakkula.Mamatha |

కలిసి ఉంటే కలదు సుఖం అనే నినాదంతో భార్యాభర్తల మధ్య జరిగే వివాదాలను, గొడవలను సర్ది చెబుతు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా కౌన్సిలింగ్ సెంటర్ల నిర్వాహకుల సేవలు, కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ అన్నారు.

కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకుల సేవలు, కృషి అభినందనీయం: డీజీపీ సీవీ ఆనంద్
X

దిశ, తిరుమలగిరి: కలిసి ఉంటే కలదు సుఖం అనే నినాదంతో భార్యాభర్తల మధ్య జరిగే వివాదాలను, గొడవలను సర్ది చెబుతు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా కౌన్సిలింగ్ సెంటర్ల నిర్వాహకుల సేవలు, కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ సెంటర్లలో కౌన్సిలింగ్ సేవలందిస్తున్న వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించి వారిని సత్కరించారు. మల్కాజ్ గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం మీ సురక్ష పేరిట బోయినపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి డిజిపి మహిళా విభాగం డిజి చారు సిన్హా, మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్ సుమతి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ హెడ్ శ్రీదేవి లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవన ప్రమాణాలు, ప్రస్తుత సమాజ తీరుతెన్నుల నేపథ్యంలో దంపతుల మధ్య చిన్న చిన్న వివాదాలకే మనస్పర్థలు బేధాభిప్రాయాలు వస్తున్నట్లు తెలిపారు. దంపతుల మధ్య వచ్చే వైరుధ్యాలను మహిళా పోలీస్ స్టేషన్లలో పరిష్కరించడంతో పాటు, కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి తిరిగి వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్లు భరోసా కేంద్రాలతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల శాంతిభద్రతల పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు. 4 కమిషనరేట్ల పరిధులలో గత 10 సంవత్సరాలుగా 30 కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి 50 వేల కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి 6వేల700మంది దంపతుల దాంపత్యాన్ని కాపాడినట్లు తెలిపారు.

నేటి తరానికి చెందిన భార్యాభర్తలు అహంభావంతో గొడవలు పడుతూ ప్రతి చిన్న విషయానికి విడిపోయేంత దూరం వెళ్ళిపోతున్నారని ఆయన అన్నారు.దంపతుల మధ్య మనస్పర్థలు,ఇబ్బందులను దూరం చేసి వారి మధ్య సఖ్యత ఏర్పరిచేందుకు కౌన్సిలింగ్ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు.దంపతుల మధ్య అన్యోన్య జీవితానికి ఒకరినొకరు అర్థం చేసుకుంటు గొడవలు జరిగినప్పుడు కోపోద్రిక్తులు కాకుండా సహనంతో వ్యవహరిస్తే భార్యాభర్తల మధ్య దూరం తగ్గుతుందని సూచించారు.ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మల్కాజ్ గిరి కమిషనరేట్ సీపీ, మహిళా విభాగం పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జోన్ పరిధిలోని డిసిపి, ఏసీపిలు, సీఐ లు, ఎస్సైలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story