కీసరగుట్టలో చైన్ స్నాచర్లు.. క్యూలైన్‌లో భక్తురాలి 5 తులాల బంగారు గొలుసు అపహరణ!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-15 06:53:21  IST  )

మహాశివరాత్రి రద్దీని ఆసరాగా చేసుకుని కీసరగుట్ట ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. క్యూలైన్‌లో ఉన్న ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదుతో సీసీ ఫుటేజీని విశ్లేషిస్తున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కీసరగుట్టలో చైన్ స్నాచర్లు.. క్యూలైన్‌లో భక్తురాలి 5 తులాల బంగారు గొలుసు అపహరణ!
X

దిశ, వెబ్ డెస్క్: మహాశివరాత్రి వేళ రామలింగేశ్వర స్వామి (Ramalingeswara Swamy)ని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తురాలికి దొంగలు (thieves) షాక్ ఇచ్చారు. క్యూలైన్ లో నిల్చున్న భక్తురాలి 5 తులాల బంగారు గొలుసును దొంగిలించారు. ఈ షాకింగ్ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయంలో చోటు చేసుకుంది. శివరాత్రి పర్వదినం (Shivaratri festival) సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన కీసరగుట్ట (Keesaragutta)లో చైన్ స్నాచర్స్ చేతివాటం ప్రదర్శించడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జరిగిన ఈ ఘటనతో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

బాధితురాలు వెంటనే అప్రమత్తమై కేకలు వేసినప్పటికీ, జనం ఎక్కువగా ఉండటంతో నిందితులు తప్పించుకున్నారు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యూలైన్ల వద్ద ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం. శివరాత్రి సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఇలాంటి ఘటన జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story