ఘోర ప్రమాదం: అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పది మందికి తీవ్ర గాయాలు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-04 05:26:34  IST  )

ఆమనగల్లు ఉత్సవాల్లో విషాదం. తొక్కిసలాటతో అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు. 10 మందికి తీవ్ర గాయాలు; ప్రాణాలకు తెగించి రక్షించిన పోలీసులు.

ఘోర ప్రమాదం: అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పది మందికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నో ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో పెద్ద మొత్తంలో భక్తులు అగ్నిగుండంలో పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ షాకింగ్ సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో (Sri Parvati Ramalingeswara Swamy Festivals) చోటు చేసుకుంది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో ఊహించని విధంగా తొక్కిసలాట జరగడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. ఈ హృదయ విదారక ఘటనలో సుమారు పది మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

మహాశివరాత్రి ఉత్సవం అనంతరం పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున 4 గంటలకు భక్తులు భక్తిశ్రద్ధలతో అగ్నిగుండం (fire pit) దాటే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అగ్నిగుండం దాటుతున్న సమయంలో వెనుక ఉన్న వారు ఒక్కసారిగా ముందుకు తోయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకోవడంతో అగ్నిగుండం దాటుతున్న వారు నియంత్రణ కోల్పోయి నేరుగా నిప్పుల కుప్పలో పడిపోయారు.

పోలీసుల, స్థానికులు సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం..

ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి.. తమ ప్రాణాలకు తెగించి నిప్పుల్లో పడిపోతున్న భక్తులను బయటకు లాగారు. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ప్రాణాపాయం తప్పినప్పటికీ, పది మంది భక్తులు నిప్పుల్లో పడి గాయపడ్డారు. బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మృతి

Next Story