- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసముద్రంలో అభివృద్ధి వేడుకలు
కేసముద్రం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రెండు కీలక సౌకర్యాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి.

దిశ, కేసముద్రం : కేసముద్రం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రెండు కీలక సౌకర్యాలు సోమవారం అందుబాటులోకి వచ్చాయి. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) శాఖను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ స్థాయికి రావడానికి పుట్టిన గడ్డ, ఇక్కడి ప్రజల ఆశీర్వాదాలే కారణమని భావోద్వేగానికి లోనయ్యారు. తన శ్వాస ఉన్నంత వరకు కేసముద్రం అభివృద్ధికే కృషి చేస్తానని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడమే తన లక్ష్యమని అన్నారు. కేసముద్రం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటుతో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు దూర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చే వరకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డులోనే డీసీసీబీ బ్యాంక్ శాఖ ప్రారంభం కావడంతో రైతులకు పంట రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా అందనున్నాయని చెప్పారు.
వేం నరేందర్ రెడ్డికి స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మార్కెట్ యార్డు ప్రాంగణం పార్టీ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైర్ డీజీ విక్రం సింగ్ మాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఉమా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బానోతు సునీత, వైస్ చైర్మన్ అల్లం రామనాగేశ్వరరావు, జిల్లా ఫైర్ అధికారి శ్రీనాథ్, డీసీసీబీ రీజినల్ అధికారి చైతన్య, సీఈఓ సుల్తానా, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, మున్సిపల్ కమిషనర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్..
అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. తదుపరి జూనియర్, డిగ్రీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, వంటశాల, డైనింగ్ హాల్, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






