కౌలు రైతుల పెసర పంట ధ్వంసం

by Ratna Kumari |

కొణిజర్ల మండలంలో కౌలు రైతులు సాగు చేసిన పెసర పంటను గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి ట్రాక్టర్‌తో రోటావేటర్ వేసి ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది.

కౌలు రైతుల పెసర పంట ధ్వంసం
X

దిశ, కొణిజర్ల : కొణిజర్ల మండలంలో కౌలు రైతులు సాగు చేసిన పెసర పంటను గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి ట్రాక్టర్‌తో రోటావేటర్ వేసి ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత రైతులు మంగళవారం కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామ సమీపంలోని గోపవరం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 104లో పారుపల్లి అనసూయ, లింగగూడెం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 3/1లో ముక్కపాటి శాంతమ్మకు చెందిన మొత్తం 8 ఎకరాల పట్టా భూమిని కొణిజర్లకు చెందిన గంధం నాగరాజు, గొడ్డుగొర్ల శ్రీను ఎకరానికి రూ.40 వేల చొప్పున కౌలుకు తీసుకుని ఈ ఖరీఫ్ సీజన్‌లో పెసర పంట సాగు చేశారు.

ప్రస్తుతం పంట పూత, కాయ దశలో ఉండగా అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్‌కు రోటావేటర్ అమర్చి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కక్షపూరితంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. చేతికొచ్చే దశలో ఉన్న పంట నాశనం కావడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, తాము పట్టాదారుల అనుమతితో చట్టబద్ధంగా కౌలు సాగు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పంటను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతులు తెలిపారు.

Next Story