బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం: పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-17 13:18:28  IST  )

ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) పేర్కొన్నారు. శనివారం కాకినాడ పట్టణంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాన్ మాట్లాడుతూ.. ‘పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఆ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఏఎం గ్రీన్ ఎనర్జీ ముందుకు రావడం ఆనందందాయకం. ఆ దిశగా కూటమి ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్య కేంద్రంగా, పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి హబ్‌గా తీర్చిదిద్దబోతోంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోనే మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణంలో ఇదో చారిత్రక మైలురాయిగా అభివర్ణించవచ్చు.

బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం

బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం అని గ్రీన్ కో వ్యవస్థాపకులు చలమలశెట్టి అనిల్ నిరూపించారు. అనేక కష్టనష్టాలను తట్టుకుని ఈ రోజున ఏఎం గ్రీన్ కంపెనీ స్థాపించారు. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 15, 600 కోట్లు పెట్టుబడితో ప్రారంభం అవుతున్న ఈ సంస్థలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పాదక ఇంధన పెట్టుబడులు రానున్నాయి. 2027 ఏడాది చివరికి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా, పునరుత్పాదక ఇంధన ఆధారిత శుద్ధ ఇంధన కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతోంది. నిర్మాణ దశలో సుమారు 8,000 మందికి, ఆపరేషన్ దశలో సుమారు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఆ సంస్థ వ్యవస్థాపకులు అయిన చలమలశెట్టి అనిల్‌కి, మహేష్‌కి పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

Read More... మరో సంచలనానికి సిద్ధమైన బండ్ల గణేష్.. భక్తిని, రాజకీయ అభిమానాన్ని చాటుకుంటూ..

Next Story