- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ శాఖలో ‘డిప్యూటేషన్’ పంచాయతీ.. ఏళ్ల తరబడి ఇతర శాఖల అధికారుల తిష్ట
మున్సిపల్ శాఖలో డిప్యూటేషన్ అధికారుల తిష్ట! 46 మంది కొత్త అధికారులకు పోస్టింగ్ కరువు. మాతృశాఖలకు పంపాలని సీఎంకు ప్రతిపాదనలు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు తిష్ట వేశారు. డిప్యూటేషన్‌పై వచ్చి ఏండ్లతరబడి ఇక్కడే కొనసాగుతున్నారు. ఫలితంగా మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలోని అధికారులకు పోస్టింగ్ కరువయ్యాయి. దీంతోపాటు రెవెన్యూ శాఖ అధికారులు సైతం ఈ శాఖలో ఉన్నారు. ‘అన్ని శాఖల అధికారులు మున్సిపల్ శాఖలోకి వస్తున్నారు. కానీ తమకు మాత్రం ఏ శాఖలోకి వెళ్లడానికి అవకాశాలు రావడం లేదు. అవకాశం ఉన్నా రానివ్వడంలేదు.’ అని మున్సిపల్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే పంచాయతీరాజ్ శాఖ అధికారులను మాతృశాఖకు పంపించాలని మున్సిపల్ శాఖ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సైతం సీఎం రేవంత్ రెడ్డికి పంపించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో 133 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను మినహాయిస్తే 130 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి.
30 మందికి పైగా..
మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో 30 మందికిపైగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీలో నలుగురు అధికారులు కీలక సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లుగా ఉన్నారు. మిగిలిన యూసీడీ, ఇతర విభాగాల్లో ఉన్నారు. ఇక సీడీఎంఏలో 15 మందికి పైగా మున్సిపల్ కమిషనర్లుగాను, మేనేజర్లుగాను కొనసాగుతున్నారు. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన అధికారి.. మున్సిపల్ శాఖకు చెందిన అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా చేశారనే విమర్శలు లేకపోలేదు.
45 మందికి పోస్టింగ్ లేవు
మున్సిపల్ శాఖ కమిషనరేట్‌కు 41 మంది గ్రూప్-1 ఆఫీసర్స్, 11 మంది గ్రూప్-2 ఆఫీసర్స్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కేటాయించింది. అయితే వీరిలో 39 మంది గ్రూప్-1 ఆఫీసర్స్, 10 మంది గ్రూప్-2 ఆఫీసర్స్ రిపోర్టు చేశారు. గ్రూప్-1 అధికారుల్లో 36 మందికి సీడీఎంఏ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ జారీ చేసింది. 10 మంది గ్రూప్-2 ఆఫీసర్స్‌కు మాత్రం త్వరలోనే సీడీఎంఏ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. మొత్తం 46 మంది మున్సిపల్ కమిషనర్లు పోస్టింగ్ లేక ఖాళీగా ఉంటున్నారు.
పైగా వేతనాలు మాత్రం చెల్లించాల్సిందే. పంచాయతీరాజ్ శాఖ అధికారుల కారణంగా మున్సిపల్ శాఖ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేకపోతున్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వడంతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులను మాతృశాఖకు పంపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కొత్తగా గ్రూప్-1, గ్రూప్-2 అధికారులకు పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.






