- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంకేశ్వర్ బజార్‌లో డ్రైనేజీ దుస్థితి
మలక్‌పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్ పరిధి శంకేశ్వర్ బజార్‌లో డ్రైనేజీ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, చంపాపేట్ : మలక్‌పేట్ నియోజకవర్గంలోని సైదాబాద్ డివిజన్ పరిధి శంకేశ్వర్ బజార్‌లో డ్రైనేజీ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివగంగ థియేటర్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ప్రధాన డ్రైనేజీ కాలువలు, అంతర్గత మురుగునీటి మార్గాలు పూడికతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కాలనీవాసులు జీహెచ్‌ఎంసీ అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం డ్రైనేజీల నుంచి దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని స్థానికులు పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభమైతే మురుగునీరు రోడ్లపైకి పొంగిపొర్లే ప్రమాదం ఉందని, దీంతో రాకపోకలకు ఆటంకం కలగడంతో పాటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, నగర కమిషనర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కనిపించడం లేదని స్థానికులు విమర్శించారు. ప్రజాప్రతినిధులు సూచనలు చేసినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీల శుభ్రత, పూడిక తొలగింపు పనులు నిరంతరం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా నిరుపేదలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి శంకేశ్వర్ బజార్ ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో శుభ్రపరచి, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.






