ఖాకీకి కరువైన కనీస సౌకర్యాలు..!

by Batti.Sumithra |   (  Updated:2026-06-17 07:14:05  IST  )

ప్రజల సమస్యలకు పరిష్కార కేంద్రంగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే సమస్యలు గూడుకట్టాయి.

ఖాకీకి కరువైన కనీస సౌకర్యాలు..!
X

దిశ, పాల్వంచ టౌన్ : ప్రజల సమస్యలకు పరిష్కార కేంద్రంగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్‌లోనే సమస్యలు గూడుకట్టాయి. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులే ఇప్పుడు కనీస మౌలిక వసతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నెలకొన్నట్లు సమాచారం. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, పోలీస్ స్టేషన్‌లో ఒక నీటి మోటార్‌ను సైతం సకాలంలో మరమ్మతు చేయలేని పరిస్థితి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. స్టేషన్‌లోని నీటి మోటార్ కొంతకాలంగా చెడిపోవడంతో ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటి సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. దీంతో సిబ్బంది స్నానాలు, బట్టలు ఉతకడం, ఇతర నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్‌ను స్టేషన్‌కు పంపించి నీటి అవసరాలు తీర్చేలా ఏర్పాటు చేశారు. ప్రజలకు భద్రత కల్పించే పోలీస్ సిబ్బందికి కనీస నీటి వసతి కూడా కల్పించలేని పరిస్థితి వ్యవస్థ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా స్టేషన్ భవనంలోని వెంటిలేషన్ కిటికీలు పలు చోట్ల పగిలిపోయి ఉన్నాయి. స్టేషన్ చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో రాత్రి వేళల్లో దోమల బెడదతో పాటు పాములు, తేళ్లు, ఇతర విష పురుగుల సంచారం అధికంగా ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. నీటి సమస్య కారణంగా కొన్నిసార్లు బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు విష పురుగుల భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న సిబ్బంది, మరోవైపు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే పోలీసుల సమస్యలు మాత్రం పరిష్కారం కోసం ఎదురు చూడాల్సి రావడం విడ్డూరంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి మోటార్‌ను వెంటనే మరమ్మతు చేయడంతో పాటు స్టేషన్‌లోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు. “ప్రజలకు భద్రత కల్పించే ఖాకీకి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతే, అభివృద్ధి మాటలు ఎంతవరకు సార్థకం?” అనే ప్రశ్న స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story