జెన్ Zను వెంటాడుతున్న స్క్రీన్ అప్నియా? ఇంతకీ ఏమిటిది?

by Javid Pasha |

స్క్రీన్ లేదా ఈమెయిల్ అప్నియా ఉన్నప్పుడు మనం తెలియకుండానే శ్వాసను బిగపడుతుంటాం. దీని వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, ఆందోళన, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.

జెన్ Zను వెంటాడుతున్న స్క్రీన్ అప్నియా? ఇంతకీ ఏమిటిది?
X

దిశ, ఫీచర్స్ : ఈమెయిల్ చదువుతున్నప్పుడు, రిప్లై ఇస్తున్నప్పుడు, స్క్రీన్ ముందు పనిచేస్తున్నప్పుడు, టైప్ చేస్తు్న్నప్పుడు.. ఇలా ఏదో ఒక సందర్భంలో మీరు అప్రయత్నంగానే శ్వాసను కొన్ని క్షణాలు ఆపేయడం లేదా చాలా స్లోగా ఊపిరి తీసుకోవడం చేస్తున్నారా? అయితే మీరు ‘ఈమెయిల్ అప్నియా’ అనే సమస్యతో బాధపడుతుండవచ్చు. దీన్నే స్క్రీన్ అప్నియా అని కూడా అంటారు. 2007లో లిండా స్టోన్(Linda Stone) అనే పేరుగల మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ కనుగొన్న పదం ఇది. అయితే ఒకప్పుడు మిలీనియల్స్‌నే ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఈ సమస్య ఇటీవల జెన్ Z యువతలోనూ కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

ఎందుకు వస్తుంది?

తరచుగా కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా స్క్రీన్ ముందు పని చేసేవారు. అధిక ఒత్తిడితో కూడిన పని విధానం కలిగి ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ప్రధాన కారణాలు ఏమిటంటే.. స్క్రీన్ ముందు కూర్చున్నప్పుడు మన భంగిమ (posture) సక్రమంగా లేకపోవడం, ముఖ్యంగా వంగిపోవడం వల్ల ఛాతీ ఒత్తిడికి గురవుతుంది, దీంతో క్రమంగా పూర్తి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. అలాగే ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆసక్తి, ఆందోళన లేదా అనిశ్చితి వల్ల సడెన్‌గా శ్వాసను ఆపేసి సంబంధిత పనిలో టెన్షన్‌తో నిమ్నగమైపోతారు. ఆ సమయంలో కళ్లు స్క్రీన్ వైపు ఎక్కువసేపు చూడడం వల్ల అలసిపోయి శ్వాస విధానం కూడా ప్రభావితం అవుతుంది. ఈ సందర్భంగా పనిలో లీనమైపోయి శ్వాసపై ధ్వాస తగ్గడం కూడా ఒక పెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు. సుమారు 80% మందిని ఈ సమస్య వేధిస్తున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఒత్తిడిలో మన నాడీ వ్యవస్థ ఈమెయిల్‌ లేదా నోటిఫికేషన్‌ను ఒక బెదిరింపుగా భావించి శ్వాసను ఆపి, శరీరాన్ని టెన్షన్‌లో ఉంచుతుంది.

ఏం జరుగుతుంది?

శ్వాసను బిగపట్టడం లేదా స్లోగా ఊపిరి తీసుకోవడం వల్ల శరీరం “ఫైట్ లేదా ఫ్లైట్” (fight or flight) మోడ్‌లోకి వెళ్తుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. ఆందోళన పెరుగుతుంది. జాయింట్లు, భుజాలు, దవడ టెన్షన్‌లోకి వెళ్తాయి. ఇది రోజంతా కొనసాగితే అలసట, తలనొప్పి, కండరాల టెన్షన్, ఆందోళన, శరీరంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. ఒక విధంగా చెప్పాలంటే.. మన మెదడు ఈమెయిల్‌ను లేదా నోటిఫికేషన్ రాగానే ఏదో పులి వెంటాడినట్టు భావిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు ఏమిటి?

స్క్రీన్ లేదా ఈమెయిల్ అప్నియా ఉన్నప్పుడు మనం తెలియకుండానే శ్వాసను బిగపడుతుంటాం. దీని వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, ఆందోళన, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. చాలా మంది వర్కింగ్ డే చివర్లో ఎక్కువ అలసట, మెదడు మందగించడం (brain fog), భుజాలు-మెడ నొప్పి అనుభవిస్తారు. దీర్ఘకాలంగా ఉంటే నిద్ర సమస్యలు, రక్తపోటు పెరగడం, ఏకాగ్రత తగ్గడం వంటి ప్రభావాలు కూడా ఉండవచ్చు. కొందరు ఆకస్మికంగా ఒక్కసారిగా ఆవులింపు చేయడం లేదా ఊపిరి గట్టిగా పీల్చుకోవడం చేస్తుంటారు. ఇది శరీరం తనంతట తాను శ్వాసను రీసెట్ చేసుకునే ప్రయత్నంలో భాగమని నిపుణులు చెబుతున్నారు.

ఎలా అధిగమించాలి?

ముందు లక్షణాలను గమనించడం (awareness) చాలా ముఖ్యం. ఈమెయిల్ తెరిచేముందు పూర్తిగా ఊపిరి విడిచి, కాళ్లు నేల మీద ఉంచి, శరీరాన్ని రిలాక్స్ చేయాలి. 5 సెకన్లు పీల్ చేసి 5 సెకన్లు ఎక్స్‌హేల్ చేసే “కోహెరెంట్ బ్రీతింగ్” వంటి సాధారణ వ్యాయామాలు సహాయపడతాయి. అలాగే పని మధ్యలో తప్పక బ్రేక్స్ తీసుకోవాలి. నడక లేదా స్ట్రెచింగ్ కూడా మంచిది. ఇది చాలా సాధారణం కాబట్టి గిల్టీ ఫీల్ అవసరం లేదు. కానీ దీర్ఘకాలికంగా కొనసాగితే అది ఇతర నాడీ వ్యవస్థ రుగ్మతలకు, నిద్రలేమి, తలనొప్పి, వర్టిగో వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే లక్షణాలను బట్టి వైద్య నిపుణులను సంప్రదించాలి.

Next Story