- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నష్టపరిహారం చెల్లించకుండానే అప్పన్నపేట.. పెద్దపల్లి బైపాస్ పనులు
అప్పన్నపేట నుంచి పెద్దపల్లి బైపాస్ నిర్మాణం పేరుతో అన్నదాతల పొట్టగొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, పెద్దపల్లి : అప్పన్నపేట నుంచి పెద్దపల్లి బైపాస్ నిర్మాణం పేరుతో అన్నదాతల పొట్టగొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి నమ్ముకున్న నేలతల్లిని కోల్పోతూ, కనీస నష్టపరిహారం కూడా చెల్లించకుండా అధికారులు, కాంట్రాక్టర్లు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండానే రైతుల భూముల్లోకి ప్రవేశించి బైపాస్ పనులు ప్రారంభించడంతో అప్పన్నపేట గ్రామపంచాయతీ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ రైతులు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి బైపాస్ నిర్మాణం కారణంగా తమ భూములు కోల్పోతున్నప్పటికీ, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అప్పన్నపేట రైతులు వాపోతున్నారు. కనీస నోటీసులు జారీ చేయకుండానే రాత్రికి రాత్రే జేసీబీలు, భారీ యంత్రాలతో భూములను చదును చేస్తున్నారని ఆరోపించారు. తమ కళ్లెదుటే పంట పొలాలు ధ్వంసమవుతుంటే అడ్డుకునేందుకు వెళ్లిన రైతులను కాంట్రాక్టర్లు, సిబ్బంది బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. అడ్డు వస్తే తొక్కించుకుంటూ వెళ్తాం.. ఎక్కువ మాట్లాడొద్దు అంటూ తమతో దురుసుగా ప్రవర్తించారని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతు రాజిరెడ్డి మాట్లాడుతూ కనీస సమాచారం ఇవ్వకుండా మా భూముల్లోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తే, తాము కేవలం పైప్‌లైన్ పనుల కోసమే వచ్చామని, మీ భూముల్లోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. కళ్లెదుటే మా భూములను ఆక్రమిస్తూ, మమ్మల్నే మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేతిలో చిప్ప పట్టుకుని అడుక్కోవడమే..
బైపాస్ రోడ్డు కారణంగా సర్వం కోల్పోతున్న రైతు బత్తిని రాజయ్య పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. నాకున్నది రెండు చోట్ల కొద్దిపాటి భూమి మాత్రమే. ఆ రెండు భూములు కూడా ఈ బైపాస్ రోడ్డుకే పోతున్నాయి. నా భూమిని తీసుకుని, నష్టపరిహారం కూడా ఇవ్వకపోతే నా కుటుంబం ఎలా బతకాలి ? నాకు వేరే దారి లేదు. ఇక చేతిలో చిప్ప పట్టుకుని అడుక్కోవడం తప్ప మరో మార్గం మిగలలేదు అంటూ ఆయన చేసిన ఆవేదన అక్కడున్న వారందరినీ కలచివేసింది.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం: సర్పంచ్
రైతుల ఆందోళనతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సర్పంచ్ అక్కడికి చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని, ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. భూములు కోల్పోయిన రైతులందరికీ చట్టబద్ధంగా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని చెప్పారు. అయితే, తమకు న్యాయమైన నష్టపరిహారం అందే వరకు పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేశారు.






