భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం

by Malleboina Mahesh |

సోమవారం తెల్లవారు జామున దట్టమైన పొగమంచు భారతదేశాన్ని కప్పేసింది. గత రెండు రోజులుగా తీవ్రమైప చలితో పాటు దట్టమైన పొగమంచు జనజీవనాన్ని వణికిస్తోంది.

భారతదేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తం
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం తెల్లవారు జామున దట్టమైన పొగమంచు (Dense fog) భారతదేశాన్ని కప్పేసింది. గత రెండు రోజులుగా తీవ్రమైప చలితో పాటు దట్టమైన పొగమంచు జనజీవనాన్ని వణికిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రస్తుతం 'Red alert' కొనసాగుతోంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ (దృశ్యమానత) పడిపోవడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో సుమారు 66 విమాన సర్వీసులు రద్దు కాగా, వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా, ఉత్తర రైల్వే పరిధిలో సుమారు 82 రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొనసాగుతున్న చలిగాలులు.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

హిమాలయాల్లో ఏర్పడిన పశ్చిమ అలజడి (Western Disturbances) కారణంగా మైదాన ప్రాంతాల్లో చలి గాలులు మరింత తీవ్రమయ్యాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో భారీ మంచు కురుస్తుండటంతో, వచ్చే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. దట్టమైన పొగమంచు వల్ల రహదారులపై విజిబిలిటీ సున్నాకు చేరుకోవడంతో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 5 నుంచి మరొక పశ్చిమ అలజడి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్పటి వరకు పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Next Story