- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుభాష్‌నగర్‌లో అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేత
సుభాష్‌నగర్‌లో అర్ధరాత్రి జేసీబీలతో గదులు, ప్రహరీ కూల్చివేసిన ఘటనపై బీఆర్ఎస్ నేతలతో పాటు పలువురిపై కేసు నమోదైంది.

దిశ, పేట్‌బషీరాబాద్ : కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌నగర్‌లో రూ. కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేతలకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్ పోలీసులు బీఆర్ఎస్ నేత పుప్పాల భాస్కర్, విష్ణు కుమార్, రవి కొసరులతో పాటు మరో 20-25 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త భాగారాం 2006లో సుభాష్‌నగర్‌లో స్థలం కొనుగోలు చేసి, అందులో గదులు, షెడ్ నిర్మించి అద్దెకు ఇచ్చారు. గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఆ స్థలంపై హక్కు ఉందంటూ వివాదం సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో 20 నుంచి 25 మంది వ్యక్తులు స్థలంలోకి ప్రవేశించి సెక్యూరిటీ గార్డును బంధించి, అతని మొబైల్ ఫోన్ లాక్కొన్నారు. అనంతరం జేసీబీతో నాలుగు గదులు, షెడ్, ప్రహరీ గోడ, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న యజమాని భాగారాం బెంగళూరు నుంచి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






