- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వితంతువులు, దివ్యాంగులకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్ : ఢిల్లీ ప్రభుత్వం
ఇకపై వితంతువులకు, దివ్యాంగులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ప్రభుత్వం సామాజిక భద్రత పథకాల కింద ఉన్న వితంతువులు, దివ్యాంగులకు మరింత రక్షణ కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఇక నుంచి దివ్యాంగులు, వితంతువులను ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం పరిధిలోకి చేర్చాలని ఆమోదించారు. ఈ నిర్ణయం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేసే చర్యగా ప్రభుత్వం పేర్కొంది.
అధికారుల వివరాల ప్రకారం.. ఢిల్లీ పరిధిలోని దాదాపు 3.97 లక్షల వితంతువులు, 1.31 లక్షల దివ్యాంగులను ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కింద నమోదు చేయనున్నారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ వైద్య బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ బీమా వర్తిస్తుంది. పెద్ద శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక చికిత్సలు, అత్యవసర వైద్య సేవలు వంటి ఖరీదైన చికిత్సలు కూడా ఈ పథకం ద్వారా కవర్ అవుతాయి.
ఇప్పటికే వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ఆరోగ్య భద్రతను కూడా కల్పించడం ద్వారా వారి జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైద్య ఖర్చుల భారం తగ్గడంతో ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. కాగా ఈ నమోదు ప్రక్రియ, లబ్ధిదారుల ధృవీకరణ పత్రాల పరిశీలన, ఆరోగ్య కార్డుల జారీ వంటి చర్యలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ వర్గాలు పేర్కొన్నాయి.






