30 రోజుల్లో 7 బైక్‌ల చోరీ.. మలక్‌పేట పోలీసుల చాకచక్యంతో డిగ్రీ విద్యార్థి అరెస్ట్

by Batti.Sumithra |

నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ అలవాటు నేరస్థుడిని మలక్‌పేట పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

30 రోజుల్లో 7 బైక్‌ల చోరీ.. మలక్‌పేట పోలీసుల చాకచక్యంతో డిగ్రీ విద్యార్థి అరెస్ట్
X

దిశ, చంపాపేట్ : నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ అలవాటు నేరస్థుడిని మలక్‌పేట పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిందితుడు డిగ్రీ విద్యార్థి కావడం, గతంలో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా నేరాలకు దూరం కాకపోవడం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హస్తినాపురానికి చెందిన బంద్రవల్లి రాకేష్ అలియాస్ రాఖీ అలియాస్ లడ్డు (23) ఎల్‌బీనగర్‌లోని అవినాష్ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. జూన్ 29న మలక్‌పేట క్రైమ్ బృందం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మలక్‌పేటతో పాటు చైతన్యపురి, సరూర్‌నగర్, వనస్థలిపురం, నాగోల్, లాలాగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఏడు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. దర్యాప్తులో నిందితుడి వద్ద నుంచి ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్, ఒక హోండా యాక్టివా, ఒక హోండా షైన్, నాలుగు స్ప్లెండర్ మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

జైలు పరిచయాలే నేరాలకు దారి..

2021లో నమోదైన పోక్సో కేసులో జైలుకు వెళ్లిన సమయంలో పలువురు ఆస్తి నేరస్థులతో పరిచయం ఏర్పడిందని, వారి ప్రభావంతో వరుసగా వాహనాల చోరీలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇటీవల కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా తన తీరు మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు తప్పుడు తాళం చెవులను ఉపయోగించి పార్కింగ్ ప్రాంతాల్లో ఉన్న ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటిని హస్తినాపురం, సహారా ఎస్టేట్స్, పసుమాముల ప్రాంతాల్లో తనకు పరిచయమున్న వ్యక్తుల వద్ద దాచిపెట్టి, అనంతరం విక్రయించేందుకు ప్రయత్నించేవాడని దర్యాప్తులో తేలింది. కేవలం నెల రోజుల్లోనే ఏడు వాహనాలను అపహరించడం అతని నేరప్రవృత్తికి నిదర్శనమని పోలీసులు పేర్కొన్నారు.

18కు పైగా కేసుల్లో నిందితుడు..

రాకేష్‌ పై గతంలో బేగంపేట, వనస్థలిపురం, చైతన్యపురి, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్, కీసర పోలీస్ స్టేషన్లలో చోరీ, మోసం, పోక్సో తదితర కేసులతో కలిపి 18కు పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

పోలీసుల సమన్వయంతో కేసు ఛేదన..

ఈ కేసును మలక్‌పేట డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎల్.రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ కె. నర్సింహ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ధర్మిరెడ్డి గిరి ఆధ్వర్యంలో, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం. తేజ్యా నాయక్‌తో పాటు మలక్‌పేట క్రైమ్ స్టాఫ్ సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసి, చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానులు తమ వాహనాలకు స్టీరింగ్/వీల్ లాక్స్ వంటి అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

Next Story