- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

దిశ, కార్వాన్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే ఈ పథకాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో లకిడికాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ విద్యార్థులు మహా ధర్నా నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత 18 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ విద్యా పథకానికి తూట్లు పొడవడం సరికాదన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం యథావిధిగా అమలవుతున్నప్పుడు, తెలంగాణలో అమలు చేయడానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన విధానాన్ని మార్చుకొని, విద్యార్థుల పై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు, బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, జిల్లాపల్లి తాజీ, నీల వెంకటేష్, బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






