ఆన్‌లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన తండ్రి.. భయంతో ఇంటి నుంచి అదృశ్యం

by Taduka Kalyani |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని నాచారం గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.

ఆన్‌లైన్ బెట్టింగ్ లో నష్టపోయిన తండ్రి.. భయంతో ఇంటి నుంచి అదృశ్యం
X

దిశ, దమ్మపేట:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని నాచారం గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఇప్పుడు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. యాభై ఏళ్ల వయసులో ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఒక తండ్రి, ఆన్‌లైన్ వ్యసనానికి బలైపోయి కన్నవారికి దూరమయ్యాడు. మిద్దె ముత్యం కుమారుడు మిద్దె సత్యనారాయణ (50), తన కుటుంబ సంతోషం కోసం నిరంతరం తపించేవాడు. కానీ, దురదృష్టవశాత్తూ 'goexeh9.com' అనే ఒక ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ఊబిలో కూరుకుపోయాడు. సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న ఆశతోనో, లేక వ్యసనంలో పడో తను కూడబెట్టుకున్న డబ్బును అందులో పెట్టుబడిగా పెట్టాడు. ఏ రోజుకైనా గెలుస్తానన్న భ్రమలో అక్షరాలా మూడు లక్షల యాభై వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.ఆ క్షణంలో ఆ తండ్రి గుండె ఎంతలా ఆగిపోయి ఉంటుందో ఊహించడం కష్టం. అంత పెద్ద మొత్తం పోయిందన్న బాధ కంటే, ఈ విషయం తన భార్యాపిల్లలకు తెలిస్తే ఏమవుతుందన్న భయమే అతన్ని మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. తన వారి ముందు ఎక్కడ దోషిగా నిలబడాల్సి వస్తుందో, కుటుంబంలో ఇంకెంతటి గొడవలు జరుగుతాయో అన్న అపరాధ భావం ఆ తండ్రిని కోలుకోలేని ఆందోళనకు గురిచేసింది. సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఏదో ఒక దారి దొరికేది. కోపంతో రెండు మాటలు అనుకున్నా, చివరికి రక్తం పంచుకున్న బంధమే కదా అని అక్కున చేర్చుకునేవారు. కానీ, సత్యనారాయణ ఆ ధైర్యం చేయలేకపోయాడు. భయం, మానసిక సంఘర్షణల మధ్య జూన్ 27వ తేదీ ఉదయం 09.00 గంటల సమయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన వాళ్లకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, తనకెదురైన నరకాన్ని ఎవరితోనూ పంచుకోలేక, వ్యక్తిగత ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న యాభై వేల రూపాయలు తీసుకుని నిశ్శబ్దంగా ఇల్లు దాటి వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు ఆ ఇల్లు చూసి అతని మనసు ఎంతలా కుమిలిపోయి ఉంటుందో ఎవరికీ తెలియదు. అలా వెళ్లిన మనిషి తిరిగి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. ఊరంతా గాలించారు, తెలిసిన బంధువులందరినీ అడిగారు. చివరికి అసలు విషయం తెలిసి ఆ కుటుంబం కుప్పకూలిపోయింది.

కన్నీరుమున్నీరవుతున్న కొడుకు

తండ్రి అదృశ్యం కావడంతో అతని కొడుకు మిద్దె మణికంటేశ్వర్ పడుతున్న వేదన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. నాన్న పోగొట్టుకున్న ఆ డబ్బు కంటే నాన్న ప్రాణమే మాకు ముఖ్యమని, ఆస్తులు పోయినా కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చని, కానీ ఆ దేవుడు లాంటి నాన్న దూరమైతే తాము అనాథలం అయిపోతామని ఆ కొడుకు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేస్తోంది. తప్పు చేస్తే దండించుకుంటాం కానీ, ఇలా ఏమీ చెప్పకుండా వెళ్లిపోవడం ఏ న్యాయం నాన్న అంటూ ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ఎక్కడున్నా నాన్న క్షేమంగా తిరిగి రావాలని ఆ కొడుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. తన నాన్న కోసం ఏ దారీ కానరాక, చివరికి దమ్మపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తండ్రి అదృశ్యంపై పోలీసులకు కన్నీళ్లతో ఫిర్యాదు చేశాడు. పరిస్థితి తీవ్రతను, ఆ కుటుంబం పడుతున్న వేదనను అర్థం చేసుకున్న దమ్మపేట ఎస్ఐ రాజేష్ కుమార్ వెంటనే కేసు నమోదు చేసి, ఆ తండ్రి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ ఘటన కేవలం నాచారం గ్రామానికో, ఒక సత్యనారాయణకో పరిమితమైనది కాదు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు పచ్చని కుటుంబాల్లో ఎలాంటి చిచ్చుపెడతాయో, మనుషుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడతాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ భయంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నా, కుటుంబానికి దూరమైనా ఆ లోటును ఎవరూ పూడ్చలేరు. సత్యనారాయణ ఎక్కడున్నా ఈ విషయం తెలిసి తిరిగి తన ఇంటికి చేరుకోవాలని, ఆ తండ్రీకొడుకులు మళ్లీ కలుసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.

Next Story