భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా!

by Muthe.Rajitha |

ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా పడింది.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా!
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూలై 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా మారిన షెడ్యూల్ ప్రకారం జూలై మూడో వారంలో ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉందని సమాచారం. అలాగే, కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ జూలై 25 నాటికి మొదలవుతాయని తెలుస్తోంది. ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ఇప్పటికే దాదాపు 98 శాతం పూర్తయ్యాయి. రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఇతర సాంకేతిక వసతుల పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. గతంలో జూలై 5న ఇనాగరేషన్ పూర్తి చేసి, జూలై 8 నుంచి సింగపూర్‌కు చెందిన 'స్కూట్' (Scoot) ఎయిర్‌లైన్స్ వంటి కొన్ని అంతర్జాతీయ విమానాలను నడపాలని ప్లాన్ చేశారు. కానీ ప్రారంభోత్సవం వాయిదా పడటంతో ఆయా విమాన సర్వీసుల షెడ్యూల్ కూడా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న పౌర విమాన సర్వీసులను పూర్తిగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. విశాఖ నగరం నుండి సుమారు 45-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురానికి ప్రయాణికులు సులువుగా చేరుకునేలా కనెక్టివిటీ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. జాతీయ రహదారి (NH-16) ఫ్లైఓవర్ పనులతో పాటు అనుసంధాన రోడ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. మరో రెండు వారాల్లో కొత్త ప్రారంభోత్సవ తేదీతో పాటు, విమానాల రాకపోకల పూర్తి షెడ్యూల్‌ను ప్రభుత్వం, విమానయాన సంస్థలు సంయుక్తంగా ప్రకటించనున్నాయి.

Next Story