హైదరాబాద్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందడి.. వారితో ప్రత్యేక భేటీ!

by Malleboina Mahesh |

హైదరాబాద్ జుబిలీహిల్స్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందడి.. వారితో ప్రత్యేక భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) శుక్రవారం (జూన్ 12) హైదరాబాద్‌లో సందడి చేశారు. నగర పర్యటనలో భాగంగా ఆయన జూబ్లీహిల్స్ పరిధిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులు, కీలక వ్యక్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ విజయాలు, దేశ రక్షణ రంగంలో సాధించిన పురోగతిని వివరించడంతో పాటు సమాజంలో వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

సినీ, క్రీడా రంగాల ప్రముఖుల హాజరు..

ఈ హై ప్రొఫైల్ సదస్సులో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారుడు శ్రీకాంత్ కిదాంబి, ఒలింపిక్ షూటర్ ఇషా సింగ్ ఈ భేటీలో పాల్గొని రక్షణ మంత్రితో ముచ్చటించారు. దేశంలో క్రీడా రంగానికి కేంద్రం అందిస్తున్న మద్దతును ఈ సందర్భంగా వారు అభినందించారు. అలాగే టాలీవుడ్ యువ సంచలనం, ‘హనుమాన్’ ఫేమ్ నటుడు తేజ సజ్జా, వైవిధ్యభరిత చిత్రాల హీరో అడివి శేష్ లు రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రత్యేకంగా కలిశారు.

దేశభక్తి నేపథ్యంలో అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమాను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటడంతో క్రీడా, సినీ రంగాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఇటువంటి ప్రతిభావంతులను కలవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు.

Next Story