- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో పూర్తి స్వేచ్ఛ ఉంది.. సభకు అనుమతి నిరాకరణపై CM రేవంత్ క్లారిటీ
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తెలంగాణలో ఎవరైనా రాజకీయాలు చేయవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తెలంగాణలో ఎవరైనా రాజకీయాలు చేయవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ పర్యటనలు, శాంతిభద్రతలు మరియు మధ్యప్రదేశ్ ఎన్నికల పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తేదీన తెలంగాణలో పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై స్పష్టత ఇచ్చారు. కేవలం శాంతి భద్రతలను (Law and Order) పరిగణలోకి తీసుకుని మాత్రమే పోలీసులు ఆ నిర్ణయం తీసుకున్నారని, దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. "తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయనకు నచ్చినట్లు ఆయన రాజకీయాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా పోటీ చేయడానికి అర్హులే" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఓట్ చోరీ అయిపోయింది.. ఇప్పుడు సీట్ చోరీ: బీజేపీపై ఫైర్
ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, మధ్యప్రదేశ్ ఎన్నికల పరిణామాలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను బీజేపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఆయన మండిపడుతూ.. ఇది ముమ్మాటికీ కుట్రపూరిత చర్యేనని ఆరోపించారు. "మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. అయినప్పటికీ ఆమె నామినేషన్ను తిరస్కరించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మధ్యప్రదేశ్‌లో రిటర్నింగ్ అధికారి పూర్తిగా తప్పుగా వ్యవహరించారు. దేశంలో మొదట ఓట్ల చోరీ జరిగింది.. ఇప్పుడు ఏకంగా సీట్ల చోరీకి పాల్పడుతున్నారు" అంటూ సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






