- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతి త్వరలో యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు: డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి: సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసన సభ్యులు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారని చెప్పారు. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
అర్హత సాధించిన 335 మంది వారసులకు..
ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు సూచించారు. ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం (ఈ నెల 13వ తేదీ) జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తెలియజేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణిలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల అంశం తమ దృష్టిలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ అంశంపై న్యాయ పరమైన సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనల మేరకు న్యాయ సలహా ప్రకారం సానుకూలంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి..
సింగరేణిలో ప్రతీ ఉద్యోగికి అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో అన్ని ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ చేసేలా చర్యలు తీసుకోవడమే కాకుండా గోదావరిఖని లో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు, డిపెండెంట్ పిల్లల వైద్య సేవల కోసం ఏటా రూ.300 కోట్లకు పైగా వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా సింగరేణి కార్మికుల కష్టాలు, సమస్యలను ప్రత్యక్షంగా చూసినట్లు పేర్కొన్నారు. అందువల్ల సింగరేణి కార్మికుల పట్ల తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, వారి సంక్షేమం, ఉద్యోగ భద్రత మరియు వారి కుటుంబాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా సింగరేణిని బహుముఖంగా విస్తరించేందుకు, కొత్త బొగ్గు బ్లాక్లు సాధించేందుకు తద్వారా ఉద్యోగుల వారసులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతాయన్నారు. ఒడిశా నైనీ బ్లాక్ అనుమతులతోపాటు బొగ్గు ఉత్పత్తికి ప్రజా ప్రభుత్వంలో తీసుకున్న ప్రత్యేక చొరవను గుర్తుచేశారు. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ సింగరేణిని విస్తరించే దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే పోటీ మార్కెట్లో సింగరేణి నిల దొక్కుకోవాలంటే ఉత్పత్తి, ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.






