గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం

by Nallavelli.Anjaneyulu |

గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం
X

దిశ, గోదావరిఖని : గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 53 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ నిషేధిత గంజాయి 200.465 కిలోలను ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కోర్టు అనుమతితో ధ్వంసం చేసినట్లు తెలిపారు. న్యాయాధికారుల సమక్షంలో కేసు ప్రాపర్టీ నుంచి ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షల కోసం నమూనాలు సేకరించి, మిగిలిన గంజాయిని కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలం, ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ ఇన్‌సినిరేటర్స్‌లో దహనం చేసినట్లు తెలిపారు. మొత్తం 53 కేసులకు సంబంధించిన 200.465 కిలోల ఎండు గంజాయితో పాటు 34 గంజాయి మొక్కలను ఇన్‌సినిరేషన్ ప్రక్రియ ద్వారా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ధ్వంసం చేసిన గంజాయి, గంజాయి మొక్కల మొత్తం విలువ రూ.1,00,23,250 ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనపై అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించిన గంజాయిని ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. కొంతమంది అక్రమార్జన కోసం గంజాయి సాగు, సరఫరా, రవాణా, విక్రయాలు నిర్వహిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టేందుకు స్థానిక పోలీసులు, స్పెషల్ డ్రగ్ కంట్రోల్ టీమ్స్, నార్కోటిక్ విభాగం సిబ్బంది ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి విక్రయించే, సేవించే వారి వివరాలను పోలీసులకు అందిస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇకపై గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై వాటిని సేవించే వారిపైనా చట్టపరమైన కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి,అడిషనల్ డీసీపీ(అడ్మిన్) కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,జైపూర్ ఏసీపీ ఎ.వెంకటేశ్వర్లు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బాబురావు,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story