- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీ చదువులపై తగ్గుతున్న మోజు.. రెండేళ్లలో 31 శాతం డౌన్
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారిలో భారతీయులే అధికంగా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారతీయ విద్యార్థుల ఇతర దేశాల్లో చదువుకునేందుకు వెళ్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారిలో భారతీయులే అధికంగా ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో భారతీయ విద్యార్థుల ఇతర దేశాల్లో చదువుకునేందుకు వెళ్తుంటారు. రెండేళ్ల ముందు వరకు ఈ సంఖ్య భారీగా ఉన్నప్పటికి.. ఎవరూ ఊహించని విధంగా గత రెండేళ్లలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర విద్యాశాఖ రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2023లో సుమారు 9.08 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లగా, 2024లో ఆ సంఖ్య 7.70 లక్షలకు, 2025 నాటికి ఏకంగా 6.26 లక్షలకు పడిపోయింది. అంటే కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అబ్రాడ్ వెళ్లే వారి సంఖ్యలో 31 శాతం క్షీణత నమోదైంది. విదేశీ విద్య అనేది పూర్తిగా విద్యార్థుల వ్యక్తిగత నిర్ణయమని, వారి ఆర్థిక స్తోమత, బ్యాంక్ లోన్ల లభ్యత, గ్లోబల్ ఎక్స్‌పోజర్ వంటి అంశాలు దీనిని ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే ఈ తగ్గుదలకు అంతర్జాతీయంగా మారుతున్న వీసా నిబంధనలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇటీవల స్టూడెంట్ వీసా కోటాపై పరిమితులు విధించడమే కాకుండా, విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులను (డిపెండెంట్లను) తీసుకెళ్లే నిబంధనలను కఠినతరం చేశాయి. దీనికి తోడు విదేశీ కరెన్సీ విలువ పెరగడం వల్ల సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు భారంగా మారాయి. విదేశాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత లభించే వర్క్ పర్మిట్లపై కూడా అనిశ్చితి నెలకొనడం విద్యార్థులను ఆలోచనలో పడేస్తోంది.
అలాగే భారత ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు కూడా ఈ మార్పుకు దోహదపడుతున్నాయి. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లోనే తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన కొన్ని ప్రముఖ యూనివర్సిటీలు గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించాయి. స్వదేశంలోనే తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి రావడం, దేశీయంగా ఐఐటీలు, ఐఐఎంల వంటి సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మెరుగుపడటంతో విద్యార్థులు భారత్‌లోనే ఉండటానికే మొగ్గు చూపుతున్నారు.






