రేషన్ పంపిణీ పై డేగ కన్ను.. అక్రమ బియ్యం పట్టుబడితే డీలర్‌షిప్ రద్దు!

by Malleboina Mahesh |

రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా తెలంగాణ పౌరసరఫరాల శాఖ నిఘా! ఇకపై నెలలో రెండుసార్లు విజిలెన్స్ తనిఖీలు. అక్రమాలకు పాల్పడితే డీలర్‌షిప్ రద్దు ఖాయం.

రేషన్ పంపిణీ పై డేగ కన్ను.. అక్రమ బియ్యం పట్టుబడితే డీలర్‌షిప్ రద్దు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రేషన్​బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిఘా పెట్టింది. ప్రతి నెలలో రెండు పర్యాయాలు రేషన్​దుకాణాలు, గోదాములు తనిఖీ చేసేందుకు విజిలెన్స్ ప్లాన్​చేస్తోంది. ఇతర రాష్ట్రాలకు పీడీఎస్​రైస్​చేరవేసే దళారులకు సహకరించే డీలర్లపై డేగ కన్ను వేసింది. తనిఖీలో బయటపడితే వారి డీలర్‌షిప్​రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంలో సుమారు 1500 క్వింటాళ్ల రేషన్​బియ్యం విజిలెన్స్ ​తనిఖీలో పట్టుబడింది.

దీంతో దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేషన్​కార్డులు పేదలతోపాటు కోటీశ్వర్లు కూడా పొందడంతో వారంతా సన్నబియ్యం తీసుకోకుండా డీలర్లకే కిలో రూ. 15 చొప్పన అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కార్డుల జాబితాలో సుమారు 8 నుంచి 9 లక్షల వరకు నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారు ఉన్నట్లు ఉన్నతాధికారులు గతంలోనే అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం వాటి తొలగింపు దిశగా చర్యలు తీసుకోలేదు.

తనిఖీలపై అత్యంత గోప్యత..

రేషన్​దుకాణాలు, గోదాములు తనిఖీ చేసే వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముందుగా విజిలెన్స్​బృందాలకు చెబితే సంబంధిత డీలర్లకు సమాచారం చేరవేస్తున్నారు. ఆఫీస్ నుంచి బయలుదేరే వరకు పక్కనే ఉన్న సిబ్బందికి కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా డీలర్ల వద్దకు వెళ్లే వరకు ఎటువైపు వెళ్తున్నామో చెప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. బియ్యం పంపిణీలో తప్పిదాలను గుర్తించి కౌన్సిలింగ్​ఇస్తున్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర ఇటీవల హైదరాబాద్ బేగంపేట, బాగ్‌లింగంపల్లిలో తనిఖీలు చేసి అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు విద్యార్థులకు సంబంధించి సంక్షేమ వసతి గృహాలు, మధ్యాహ్నం భోజన పథకం, అంగన్‌వాడీలకు నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

Next Story