ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలపై ప్రతిష్ఠంభన

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలపై ప్రతిష్ఠంభన
X

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. మూడేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు పదేళ్లకు పైగా నిలిచిపోవడంతో వ్యాపారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. చివరిసారిగా 2016 మే 2న ఎన్నికైన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. అనంతరం 2024 జూలైలో పాత కమిటీని రద్దు చేసి, కొత్త ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది సభ్యులతో అడహాక్ కమిటీని ఏర్పాటు చేశారు. కన్వీనర్‌గా ప్రముఖ వ్యాపారవేత్త పరిమి సోమశేఖర్ ను నియమించారు. అంతకుముందు ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో "శ్రీ సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్" పేరుతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేపట్టారు. ఈ కమిటీలో అధ్యక్షుడిగా దేవి ప్రసాద్, కార్యదర్శిగా చారుగుళ్ల శ్రీనివాస్, కోశాధికారిగా **బచ్చు శ్రీనివాస్**తో పాటు మరికొందరు సభ్యులు బాధ్యతలు చేపట్టారు.

60 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా... 18 నెలలుగా జాప్యం..

అడహాక్ కమిటీ ఏర్పడిన 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీలో నిర్ణయించినప్పటికీ, 2024 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన కమిటీ 12 సమావేశాలు నిర్వహించినా ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. 2025 మార్చి 18న కొత్త రిజిస్ట్రేషన్ పూర్తయినా ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు. మొదట ఎన్నికల బాధ్యతలు పరిమి సోమశేఖర్‌కు అప్పగించినప్పటికీ, కొందరి అభ్యంతరాల నేపథ్యంలో ఆయన తప్పుకున్నారు. అనంతరం మల్లికార్జునరావుకు బాధ్యతలు అప్పగించినా, ఆయన కూడా తప్పుకోవడంతో ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.

లెక్కలే అసలు వివాదానికి కారణమా..?

ఛాంబర్ భవన నిర్మాణం కోసం వ్యాపారుల నుంచి సేకరించిన విరాళాల ఆదాయం, వ్యయాల వివరాలు వెల్లడించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణానికి ఎంత మొత్తం వసూలు చేశారు? ఎంత ఖర్చు చేశారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే అడహాక్ కమిటీ ఎన్నికల నిర్వహణకే పరిమితమై ఉండాల్సి ఉండగా, ఛాంబర్ భవనాన్ని తొలుత ఓల్డ్ ఏజ్ హోమ్‌కు నెలకు రూ.50 వేల అద్దెకు, అనంతరం గర్ల్స్ హాస్టల్‌కు రూ.20 వేల అద్దెకు ఇవ్వడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కమిటీకి అధికారాలున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సుమారు 500 మంది సభ్యులు సభ్యత్వ రుసుము చెల్లించినప్పటికీ ఎన్నికలు జరగకపోవడం, కమిటీలోని ఏడుగురిలో నలుగురు సభ్యులు వైదొలగడం వల్ల కమిటీ ఉనికిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల కోసం నిరాహార దీక్ష.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ వ్యాపారవేత్త ముక్తేశ్వరరావు ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు భద్రాచలంతో పాటు రాష్ట్రంలోని పలువురు వ్యాపారులు మద్దతు తెలిపారు. అనంతరం ప్రముఖుల సూచనతో ఆయన దీక్షను విరమించారు.

వ్యాపారుల డిమాండ్..

సభ్యత్వ రుసుములు, భవన నిర్మాణ విరాళాల పేరుతో సేకరించిన ప్రతి రూపాయికి పూర్తి లెక్కలు వెల్లడించి, జనరల్ బాడీ సమావేశం నిర్వహించి, అనంతరం పారదర్శకంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నిర్వహించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story