ఖమ్మం కార్పొరేషన్‌లో 'ఖతర్నాక్' కాంట్రాక్టర్ మాయాజాలం

by Malleboina Mahesh |

ఖమ్మం కార్పొరేషన్‌లో ఒకే కాంట్రాక్టర్‌కు మెజార్టీ పనులు! అధికారుల అండతో అక్రమ దందా. 'దిశ' కథనంతో రంగంలోకి దిగిన మంత్రి. విచారణకు ఆదేశం.

ఖమ్మం కార్పొరేషన్‌లో ఖతర్నాక్ కాంట్రాక్టర్ మాయాజాలం
X

దిశ, ఖమ్మం బ్యూరో: అర్ధబలం, అంగబలం ఉంటే అనుకున్నది సాధించుకోవచ్చన్నట్లు, వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా దొరకాల్సినవి దొరుకుతాయన్నట్లు ఖమ్మం కార్పొరేషన్లో ఓ కాంట్రాక్టర్ వ్యవహార శైలి తీవ్ర చర్చకు దారితీస్తుంది. కాంట్రాక్టర్‌గా అవతారమెత్తిన తక్కువ కాలంలోనే ఖమ్మం కార్పొరేషన్‌ను గుప్పిట పట్టి అనుకున్న పనులను దక్కించుకోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఏండ్లుగా వివిధ పనులు చేస్తూ, బిల్లులు ఆలస్యమైనా వడ్డీలు కట్టుకుంటూ భరిస్తున్న మధ్యతరగతి కాంట్రాక్టర్లు ఇతగాని దెబ్బకు కుదేలవుతున్న టు టాక్ నడుస్తుంది.

తక్కువ కాలంలోనే నయానో, భయానో నజరానాలు చెల్లిస్తూ అధికారులను మచ్చిక చేసుకుంటూ మెజార్టీ పనులు ఆయనే చేయడం ఒక విషయమైతే.. పనుల్లో డొల్లతనాన్ని కప్పిపుచ్చుతున్న అధికారుల తీరు, ఆయనకు సపోర్టు చేస్తున్న విషయం విస్మయం గొలుపుతుంది. కార్పొరేషన్లో చిన్నా, పెద్ద పనులు చేసే కాంట్రాక్టర్లు ఆయన్ను ‘ఖతర్నాక్’ అని, ఆయన అనుకుంటే సాధించలేనిదంటూ లేదంటూ కితాబిస్తూ కక్కలేక మింగలేక పనులు దక్కించుకోవడానికి నానా అగచాట్లు పడటం విస్తు గొలుపుతుంది.

శ్రీ‘ధర’ మాయాజాలం..

పనులు ఏవైనా సరే మెజారిటీ సంఖ్యలో ఆయనకే దక్కాలని కార్పొరేషన్ అధికారులు తమకు తోచిన సహాయం అందిస్తుంటారని టాక్ నడుస్తుంది. కొందరు అధికారులను, సిబ్బందిని మచ్చిక చేసుకుని వివిధ పనులను దక్కించుకోవడం పరిపాటిగా మారిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ వర్క్స్ అయినా, టెండర్ల పనులైనా ఆయనే దక్కాలనే కంకణం కట్టుకున్న కొందరు లొసుగుల ఆధారంగా సహాయం చేసి మిగతా కాంట్రాక్టర్లకు దక్కకుండా చేస్తున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారికి దగ్గరే ఉంటే ఓ అధికారి ఇతనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాడనే చర్చ సాగుతున్నది. అంతేకాదు మిగతా కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే ఆలస్యం చేస్తారని, లేదంటే నాసిరకంగా చేస్తారని సదరు కాంట్రాక్టరైతే రాత్రింబవళ్లు కష్టపడైనా పనులు పూర్తిచేస్తాడని అధికారుల వద్ద ప్రచారం చేసి నామినేషన్ పనులు కూడా ఆయనకే ఇప్పిస్తున్నట్లు చర్చ సాగుతోంది. అటు అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా అనుకున్నది చేయించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ మాయాజాలం అంత ఇంత కాదన్న ప్రచారం జోరుగా నడుస్తుంది.

మెజారిటీ నామినేషన్ పనులు ఆయనకే..

ప్రజా ప్రయోజనాలు, అత్యవసర నిర్వహణ కోసం పనులను వేగంగా చేయడం కోసం టెండర్లు లేకుండా కాంట్రాక్టులను నామినేషన్ ద్వారా కేటాయిస్తుంటారు. ఈ నామినేషన్ పనులు విషయంలో అనుభవం, అంకితభావం ఉన్న కాంట్రాక్టర్లకు దక్కడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దశాబ్దాలుగా కాంట్రాక్టు పనుల్లో ఉన్న కాంట్రాక్టర్లకు సైతం నామినేషన్ పనులు దక్కకపోవడం, కొందరు అధికారుల తీరుతో ఒక్కరికే దక్కడంతో విమర్శలు వస్తున్నాయి. మిగతా కాంట్రాక్టర్ల విషయంలో అధికారులే చొరవ తీసుకుని వారి పనితీరుపై విమర్శలు చేయడంతో పాటు, డీ మోరల్ చేయడం పరిపాటిగా మార్చుకుని అనుకున్న వ్యక్తికే పనులు దక్కేటట్లు చేస్తున్నారన్న విషయం ప్రస్తుతం కార్పొరేషన్ కార్యాలయంలో కోడై కూస్తోంది.

నటిస్తూ.. నమ్మిస్తూ..

ఖతర్నాక్ కాంట్రాక్టర్ మిగతా కాంట్రాక్టర్లతో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా తన పని తాను అధికారులతో చాకచక్యంగా చేసుకుపోతుంటాడని తోటి కాంట్రాక్టర్లే చెప్పడం కొసమెరుపు. టెండర్ల సమయంలో కానీ, నామినేషన్ పనుల్లో కానీ అందరం కలిసి చేద్దామని, పలానా పనులు ఫలానావారు తీసుకుందామని నమ్మించి, ఒప్పించి చివరికి తనకే దక్కేలా చేసుకోవడంలో సిద్ధహస్తుడని అంటున్నారు. తన పేరిట, తన భార్య పేరిట అనుమతులు తీసుకుని అందినకాడికి కాంట్రాక్టు పనులు చేసుకుంటూ పోతుంటాడని చెప్పడం గమనార్హం. కేవలం కార్పొరేషన్ పనులు మాత్రమే చేస్తుంటాడని, మిగతా ఏ శాఖల్లో పనులు ముట్టుకోడని అందుకు కారణాలు లేకపోలేదని వాపోతున్నారు.

ఓ అధికారి అండదండలు..

కాంట్రాక్టర్ ఇంతగా భరితెగించడానికి కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ అధికారి కాంట్రాక్టుల దక్కేందుకు సర్వశక్తులు ఒడ్డుతాడని, అతడి కనుసన్నల్లోనే అన్ని వ్యవహారాలు మిగతా అధికారుల చేస్తుంటారన్న చర్చ సాగుతోంది. ఏండ్లుగా కార్పొరేషన్ పనులు చేస్తున్న పదుల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టర్ల విషయంలో లేని ప్రేమ ఒక్కరి మీద ఉండటం విమర్శలు దారితీస్తుంది. అంతేకాదు రొటేషన్ పద్ధతిలో ‘తమకు కూడా పనులు ఇస్తే చేసుకుంటాం కదా’ అన్న చర్చ సాగుతోంది. ఎవరికి అందాల్సినవి వాళ్లకు అందుతున్నాయని, అందుకే ఒక్కరికే పనులు సొంతం అవుతుంది బహిరంగ రహస్యమే.

కమిషనర్ ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు..

టెండర్లు, నామినేషన్ పనుల విషయంలో ఎవరికి ఏయే పనులు దక్కాయి? ఎవరెవరు ఏయే వర్క్స్ చేస్తున్నారు? వారి సామర్థ్యం ఏంటి? పనితీరు ఏంటి? గతంలో ఉన్న అనుభవం ఏంటి? పనుల్లో క్వాలిటీ ఎంత? అన్న విషయాలపై కమిషనర్ దృష్టి సారిస్తే అనేక అవకతవకలు బయటపడుతాయన్న చర్చ సాగుతోంది. కమిషనర్ దృష్టికి ఈ విషయాలు వెళ్లకపోవడంతోనే సదరు కాంట్రాక్టర్ రెచ్చిపోతున్నాడని, పనుల్లోనూ డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుందిన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌కు సాయం చేసే అధికారులు ఎవరో, అతనికే మెజార్టీ పనులు ఎందుకు దక్కేలా చూస్తున్నారో విచారణ చేయాలన్న డిమాండ్ వ్యక్తం అవుతుంది. కాంట్రాక్టర్ల అందరికీ రొటేషన్ పద్ధతిలో పనితీరు ఆధారంగా పనులు కేటాయించాలని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దిశలో వెబ్‌సైట్‌ వచ్చిన ఈ కథనంపై మంత్రి ఆరా తీశారు. అధికారులతో మిగతా కాంట్రాక్టర్లతో చర్చించారు. తక్షణం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Next Story