అమెరికా పౌరులే లక్ష్యంగా సైబర్ దందా

by Muthe.Rajitha |

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్ల మోసాల గుట్టును ఈడీ రట్టు చేసింది.

అమెరికా పౌరులే లక్ష్యంగా సైబర్ దందా
X

దిశ,తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ నకిలీ కాల్‌సెంటర్ల మోసాల గుట్టును ఈడీ రట్టు చేసింది. అమెరికన్లను భయభ్రాంతులకు గురిచేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాపై ఈడీ మంగళవారం ఉక్కుపాదం మోపింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు.. ఈ కేసులో కీలక నిందితుడైన వికాస్ నిమార్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసులతో పాటు ఢిల్లీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పిఎంఎల్‌ఏ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి ఈ దాడులు నిర్వహించింది.

అమెరికా అధికారులమంటూ బెదిరింపులు..

నిందితులు అమెరికా ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులమని నమ్మించి అక్కడి పౌరులకు ఫోన్లు చేసి. పన్నులు, రుణ బకాయిలు చెల్లించలేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మీ ప్రమేయం ఉందంటూ తీవ్రంగా భయపెట్టేవారు. వెంటనే చెల్లింపులు చేయకపోతే అరెస్టు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించి అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేయించడం, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డబ్బులు మళ్లించడం ద్వారా కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారు.

క్రిప్టోకరెన్సీలోకి అక్రమ సంపాదన..

బాధితుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని నిందితులు బిట్‌కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలుగా మార్చినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అహ్మదాబాద్‌లో జరిపిన దాడుల్లో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి వద్ద నుంచి సుమారు 12 వేల అమెరికన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని, రూ.13.5 లక్షల నగదును, పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురిపై పిఎంఎల్‌ఏ కేసులు..

ఈ కేసులో నాలుగు నెలల క్రితమే హైదరాబాద్‌లోని పలు నకిలీ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు జరిపింది. వేర్వేరు నగరాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని చోట్లా ఒకే తరహా మోసపూరిత విధానాన్ని ఈ ముఠా అనుసరించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ కేసులో మహమ్మద్ అన్సారి అలియాస్ మహమ్మద్ ఇర్ఫాన్ అన్సారి, ఆకిబ్ గులామ్ రసూల్ ఘాంచి, వికాస్ కె. నిమార్, దివ్యాంగ్ రావల్, ప్రదీప్ వి. రాథోడ్‌లను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ విచారణ జరుపుతున్నారు.

బెంగళూరు డ్రగ్స్ కేసుతోనూ లింకులు..

మరోవైపు, నకిలీ కాల్ సెంటర్ల కేసే కాకుండా బెంగళూరులో నమోదైన ఒక భారీ డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఈడీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ రెండు కేసుల్లోనూ విచారణ చురుగ్గా సాగుతోందని, స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ అంతర్జాతీయ సైబర్ ముఠాకు చెందిన మరిన్ని కీలక ఆధారాలు వెలుగులోకి రావడంతో పాటు, మరికొందరి అరెస్టులు ఉండే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.

Next Story