యూట్యూబ్‌లో తప్పుడు ప్రకటనలు.. రూ.2.5 లక్షలు కాజేసిన సైబర్ నిందితుడు అరెస్ట్

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-14 08:05:51  IST  )

యూట్యూబ్‌లో గేదెలు, బర్రెలు విక్రయిస్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరస్థుడిని గజ్వేల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబ్‌లో తప్పుడు ప్రకటనలు.. రూ.2.5 లక్షలు కాజేసిన సైబర్ నిందితుడు అరెస్ట్
X

దిశ, ములుగు: యూట్యూబ్‌లో గేదెలు, బర్రెలు విక్రయిస్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరస్థుడిని గజ్వేల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గజ్వేల్ రూరల్ సీఐ డి.రవి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌కు చెందిన పల్లె సాయికిరణ్ "లక్ష్మీ డెయిరీ ఫార్మ్" పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పశువుల విక్రయాల పేరుతో అడ్వాన్స్‌లు వసూలు చేస్తున్నాడు. మార్కూక్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి శంకర్‌రెడ్డి 10 బర్రెల కోసం సంప్రదించగా రూ.15 లక్షల ధర చెప్పి, అడ్వాన్స్‌గా రూ.2.50 లక్షలు ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నాడు.

అనంతరం నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి గజ్వేల్ న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇదే తరహాలో నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లోనూ కేసులు నమోదైనట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయ ప్రకటనలను నమ్మవద్దని, తెలియని వ్యక్తులకు ముందస్తుగా డబ్బులు పంపవద్దని సీఐ సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story