ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల్ని బలితీసుకుంది : వైఎస్ జగన్

by Naga Rani Yarlagadda |

మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జులై 4న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు మరణించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే మత్స్యకారుల్ని బలితీసుకుంది : వైఎస్ జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: మత్స్యకారులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జులై 4న జరిగిన పడవ ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు మరణించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం సమీపంలోని జబ్బర్ తోటలోని బాధిత మత్స్యకార కుటుంబాలను, ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారుడు చిన్నాను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్.. కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నేటికీ నెరవేర్చలేదన్నారు. పడవ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తీరానికి 10 మైళ్ల దూరంలోనే ఘటన జరిగినా.. కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆరుగురు మత్స్యకారులు జలసమాధి అయ్యారని, ఫలితంగా వారి కుటుంబాలు పెద్దదిక్కు లేనివి అయ్యాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఫిషరీస్ అధికారులు కూడా దీనిపై వెంటనే స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

ఆ రోజురాత్రి 10.30 గంటలకు ప్రమాదంపై కలెక్టర్, మెరైన్ సీఐకి బాధితులు మెసేజ్ పెట్టారని, అప్పుడే స్పందించి ఉంటే కొందరు మత్స్యకారులైనా బ్రతికేవారన్నారు. 5వ తేదీన చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడటంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడన్నారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికంతా కూడా తప్పులతడకగా ఉందన్నారు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం అనేదే లేదని, ఉంటే రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునేది కాదన్నారు. ప్రమాదం జరిగిందని తెలిశాక ఒక్క అధికారి గానీ, ఉత్తరాంధ్ర మంత్రులు గానీ, మత్స్యశాఖ మంత్రి గానీ వచ్చి పరామర్శించిన పాపాన పోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, మత్స్యకార బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన నెలలోపే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story