ప్రధాని మోడీకి కేతన్ తల్లి కన్నీటి లేఖ

by Muthe.Rajitha |

మహారాష్ట్రలోని పుణె నగరంలో యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ దారుణ హత్య (Ketan Agarwal Murder Case) దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోడీకి కేతన్ తల్లి కన్నీటి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పుణె నగరంలో యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ దారుణ హత్య (Ketan Agarwal Murder Case) దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ తన కుమారుడికి న్యాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ కన్నీటి లేఖ రాశారు. అందమైన మా ప్రపంచం తలకిందులు అయిందని, నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలంటూ ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. "మా కళ్లముందు నా బిడ్డ ఒక అందమైన జీవితాన్ని జీవించాలని కోరుకున్నాను. కానీ, దురదృష్టవశాత్తూ మేం తనకి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. నా కుమారుడిని అత్యంత దారుణంగా పొట్టనబెట్టుకున్నారు. అతడు దూరం కావడంతో నా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా శూన్యమైపోయింది. ఇంట్లో ఎటుచూసినా నా బిడ్డ జ్ఞాపకాలే మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఈ తీరని విషాదాన్ని తట్టుకోలేక.. మా కుటుంబ సభ్యుల్లో మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. మోడీజీ.. ఒక తల్లిగా నాకు ఇప్పుడు కావాల్సింది కేవలం న్యాయం మాత్రమే. న్యాయం జరగడం ఆలస్యమవుతున్నా కొద్దీ మా గుండె కోత మరింత పెరుగుతోంది.

నా బిడ్డ కేతన్ ఎప్పటికీ తిరిగిరాడనే చేదు నిజాన్ని నేను జీర్ణించుకోగలను, కానీ ఈ ఘాతుకానికి ఒడిగట్టిన బాధ్యులకు మాత్రం చట్టప్రకారం కఠిన శిక్ష పడాల్సిందే. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా మా కుటుంబానికి న్యాయం జరిగేలా చూడండి" అని ఆమె ప్రధానిని అభ్యర్థించారు. కాగా కేతన్ హత్యలో సియాతోపాటు ఆమె ప్రియుడు చేతన్ ను కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. యువ పారిశ్రామికవేత్త హత్యతో ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న పుణె వ్యాపార వర్గాలు, స్థానికులు, ఇప్పుడు తల్లి రాసిన లేఖతో ఈ కేసులో త్వరితగతిన విచారణ జరిపి నిందితులకు ఉరిశిక్ష శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Next Story