విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎన్. మల్లికార్జున్

by Batti.Sumithra |

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. మల్లికార్జున్ అన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎన్. మల్లికార్జున్
X

దిశ, నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానున్న పౌష్టిక అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకం, జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. మల్లికార్జున్ అన్నారు.

పౌష్టిక అల్పాహార పథకం అమలుకు ఏర్పాట్లు వేగవంతం

రాష్ట్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టిక అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకంతో పాటు జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న నేపథ్యంలో, కామారెడ్డి జిల్లాలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఏఎంసీ (AMC) గోదాంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కిచెన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. మల్లికార్జున్, మండల విద్యాశాఖ అధికారి వై. తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో అందుబాటులో ఉన్న స్థలం, వంటశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం తయారీకి అవసరమైన తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలను ఆయన పరిశీలించారు.

అలాగే ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆహార సరఫరాను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలనే అంశంపై పథకం నిర్వహణలో భాగస్వామ్యమైన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. మల్లికార్జున్ మాట్లాడుతూ, "విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, సమతుల్యమైన పౌష్టికాహారం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. పథకం అమలులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. ఇంటిగ్రేటెడ్ కిచెన్ ద్వారా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఆహారం తయారు చేసి, నిర్ణీత సమయానికి విద్యార్థులకు అందేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నాం. జిల్లాలో పథకం విజయవంతమైన అమలుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ పండరి, ఎంఆర్సీ సిబ్బంది సాయిలు, పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.

Next Story